నగరంలో మరో ఆరు మెగా వ్యాక్సిన్ కేంద్రాలు : CS సోమేష్ కుమార్

by Shyam |   ( Updated:2021-10-12 09:45:36.0  )
CS Somesh Kumar
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వృద్దులకు, మహిళలకు ప్రత్యేక వ్యాక్సిన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొవిడ్ మెగా వ్యాక్సిన్ కేంద్రాన్ని మంగళవారం సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… కేర్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెగా వ్యాక్సినేషన్ కేంద్రంలో రోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటలవరకు కొవిడ్ వ్యాక్సిన్ అందచేసే సౌకర్యం ఉంటుందన్నారు. కోవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఇప్పటికే రాష్ట్రంలో 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. నగరంలో ఇలాంటి మెగా వ్యాక్సిన్ కేంద్రాలు మరో ఆరు ఏర్పాటు చేస్తామన్నారు. దసరా నుండి అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో పేషంట్, అటెండెంట్‌లకు షెల్టర్లు ఏర్పాటు చేస్తామని, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.02 కోట్ల మందికి మొదటి డోస్ పూర్తి చేసినట్లు వివరించారు. ప్రతిరోజూ 3 నుండి 4 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఈ నెలలో కోటి వ్యాక్సిన్ డోసులు సరఫరా అవుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నగరానికి నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఆ ఆసుపత్రులకు బిల్డింగ్ డిజైన్ల తయారీలో ప్రభుత్వం నిమగ్నమైందన్నారు.

నిమ్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓ.ఎస్.డి గంగాధర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story