కిక్కిరిసిన సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలు.. వచ్చే నెలకిప్పుడే స్లాట్ బుకింగ్స్

by Shyam |   ( Updated:2021-07-19 07:30:57.0  )
sub-registrar offices
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సబ్​రిజిస్ట్రార్, తహశీల్దార్​ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆస్తుల లావాదేవీలకు జనం ఎగబడుతున్నారు. కరోనా వైరస్, లాక్​డౌన్​వంటి అంశాలేవీ రియల్​ ఎస్టేట్ ​రంగంపై పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా భూముల మార్కెట్​ విలువల పెంపుపై కసరత్తు నడుస్తోంది. నేడో, రేపో ఉత్తర్వులు రానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్​ ఫీజులు కూడా తడిసి మోపెడవుతాయన్న భయం పట్టుకున్నది. అందుకే వచ్చే నెలలో ఆస్తులను కొనుగోలు చేద్దామనుకున్న వాళ్లు కూడా ఇప్పుడే రిజిస్ట్రేషన్​ చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం కూడా సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో సందడి కనిపించింది. తహశీల్దార్​కార్యాలయాల్లోనూ పదుల సంఖ్యలో జనం దర్శనమిచ్చారు. ప్రతి తహశీల్దార్​ కార్యాలయంలోనూ 20 కి తగ్గకుండా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు సమాచారం. ఏ మారుమూల మండలమైనా సరే.. లావాదేవీల జోరు కనిపించింది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో గడిచిన వారం రోజులుగా పెద్ద సంఖ్యలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.

ముందస్తు బుకింగ్స్​

ఎలాగూ మార్కెట్​ విలువలు, రిజిస్ట్రేషన్​ చార్జీల పెంపు ఖాయమైంది. అయితే ఏ చిన్న ఆస్తి లావాదేవీల్లోనైనా రూ.వేలల్లో భారం పడనుంది. దీన్ని తప్పించుకునేందుకు ఆస్తుల కొనుగోలుదార్లు ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ప్లాటు, ఇల్లు, ఫ్లాట్​ కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్​ కుదుర్చుకున్న నాటి నుంచి 45 రోజులు, వ్యవసాయ ఆస్తులకైతే మూడు నెలల సమయం ఉంటుంది. అయితే పెరిగే రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి తప్పించుకునేందుకు ప్లాన్లు వేస్తున్నారు. నిర్దిష్ట రిజిస్ట్రేషన్ తేదీ కోసం ముందుగానే ఫీజులు కట్టి స్లాట్లు బుక్​చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు చివరి నాటికి కూడా స్లాట్లు బుక్ చేసుకున్నారు. ఎలాగూ స్లాట్లను పొడిగించుకునే వీలుంది. అలాగే రద్దు చేసుకుంటే ఫీజు తిరిగి పొందే వెసులుబాటు ఉంది. అందుకే ముందస్తు స్లాట్లకు భలే గిరాకీ లభిస్తుందని రంగారెడ్డి జిల్లాలోని ఓ మీ సేవా నిర్వాహకుడు చెప్పారు. చాలాన్ల కోసం కూడా కొనుగోలుదార్లు క్యూ కడుతున్నారు.

వ్యవసాయ ఆస్తుల లావాదేవీలు
అంశం జులై 1 నుంచి 18 వరకు జూన్​1 నుంచి 17 వరకు
రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లు 62,210 41318
విరాసత్​ 5138 2,713
భాగ పంపకాలు 291 102
నాలా కన్వర్షన్లు 1,693 1633

అలాగే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కూడా గడిచిన 18 రోజుల్లోనే 71,932 పూర్తయ్యాయి. దీనికి గాను రూ.525 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. సోమవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 817 స్లాట్లు బుక్ అయ్యాయి.

జూన్, జులై నెలల్లో వ్యవసాయ ఆస్తుల లావాదేవీల సంఖ్యను బట్టి రిజిస్ట్రేషన్ల ఫీజు భయం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed