‘ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు’

by srinivas |
‘ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు’
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం మద్యం ఆదాయం మత్తులో మునిగి తేలుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీకి ఉన్న మద్యం మత్తును మహిళలు త్వరలోనే వదిలిస్తారని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అప్పులు తెచ్చి అవి తీర్చలేక మద్యం రేట్లు పెంచి మందుబాబుల రక్తంతో…వారి కుటుంబాల కన్నీళ్లతో ఆ అప్పులు తీర్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మద్యపాన నిషేధం చేస్తానని ఇచ్చిన హామీ ఏమైనట్లు అని ప్రశ్నించారు. మద్యం షాపులు పెంచడమే మద్యపాన నిషేధమా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలు చాలవన్నట్లుగా పట్టణాలు, పర్యాటక ప్రాంతాల్లో మరో 300 షాపులు ఏర్పాటు చేయటం ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మద్యం షాపు లేని బజారు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి తన కమీషన్ల కోసం నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఏపీ అభివృద్ది కార్పోరేషన్ ద్వారా రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. ఆ అప్పులను మందుబాబుల రక్తంతో..వారి కుటుంబాల కన్నీళ్లతో ఆ అప్పులు తీర్చాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story