సీరియల్ కిల్లర్ అరెస్ట్.. రెండున్నర ఏళ్లలో ఆరు హత్యలు

by Sumithra |
సీరియల్ కిల్లర్ అరెస్ట్..  రెండున్నర ఏళ్లలో ఆరు హత్యలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురిని హతమార్చిన సీరియల్ కిల్లర్ ను అరెస్టు చేసినట్లుగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీరియల్ కిల్లర్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్పీ జానకి కలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన బోయ కృష్ణయ్య అలియాస్ బోయ కాశి అనే వ్యక్తి కూలీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. నేరాలకు అలవాటు పడి రెండున్నర సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. ఇక్కడ కూలి పని చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ.. జల్సాలకు అలవాటు పడ్డాడు. మరిన్ని డబ్బులు సంపాదించి.. జల్సా చేసే ఉద్దేశంతో మహిళలను లక్ష్యంగా ఎంచుకొని హత్యలకు శ్రీకారం చుట్టాడు.

ఏడాది మే 24వ తేదీన భూత్పూర్ మండలం అమిస్తాపూరు గ్రామ శివారులో గాజులపేటకు చెందిన దాసరి లక్ష్మి దారుణ హత్యకు గురి కావడంతో భూత్పూర్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలను శోధించగా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆమె వెల్లడించారు. మహబూబ్ నగర్ లో కూలి పని కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మితో కిష్టయ్య మాటలు కలిపి.. మాయమాటలు చెప్పి మద్యం తాగించి.. ఆరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో హంసపూర్ గ్రామ శివారులో ఆమె పై అత్యాచారానికి పాల్పడి.. తనకు డబ్బులు ఇవ్వాలని అడగడంతో తన టవల్ తో ఉరివేసి.. దగ్గర ఉన్న బ్లేడుతో గొంతు కోసి. ఆపై రాయితో మోదడంతో లక్ష్మీ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే సమయంలో కిష్టయ్య చేసిన హత్యల వివరాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు.

2022 నవంబర్ 21వ తేదీన జైనల్లీపూర్ గ్రామంలో వడిట్యావత్ సీతమ్మ (44), 2023 జూన్ 17న పెద్దగూడెం గ్రామం వద్ద 35 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని మహిళను, 2023 జూన్ 22న 40 నుండి 45 సంవత్సరాల మహిళను, 2024 ఫిబ్రవరి 7న మన్యంకొండ వద్ద మరో గుర్తు తెలియని మహిళల హత్య కేసులో బోయ కృష్ణయ్య నిందితుడుగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. 2023 జూన్ 13న రామచంద్రపూర్ గ్రామానికి చెందిన మున్నూరు మల్లేష్ వ్యక్తి హత్య కేసులో కిష్టయ్యని సూత్రధారి అని చెప్పారు. కేసులను సేవించడంలో ప్రధాన పాత్ర పోషించిన భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది సత్యనారాయణ, జమీర్, నవీన్ కుమార్, ఎండి ఇబ్రహీం తదితరులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story

Most Viewed