గేదెల కోసం వెళ్లి వ్యక్తి మృతి

by Sridhar Babu |   ( Updated:2024-09-22 13:49:58.0  )
గేదెల కోసం వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ, కారేపల్లి : గేదెలు కాస్తూ బుగ్గవాగులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం రొట్టమాకురేవు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రొట్టమాకురేవుకు చెందిన తోలెం ముత్యాలు(70) ఆదివారం గేదెలు తోలుకొని గ్రామ సమీపంలోని బుగ్గవాగు వద్దకు వెళ్లాడు. గేదెలను వాగులో నుంచి బయటకు రప్పించే ప్రయత్నంలో ముత్యాలు కాలుజారి వాగులో పడిపోయాడు.

శనివారం రాత్రి కురిసిన వర్షానికి బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహంలో ముత్యాలు కొట్టుకుపోయాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు గ్రామస్తులకు చెప్పి బుగ్గవాగులో వెతికారు. దాంతో కొంత సమయానికి ముత్యాలు శవమైతేలాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. మృతుని భార్య గతంలో చనిపోగా ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Next Story