ఇదో థ్రిల్లింగ్​ క్రైం స్టోరీ

by Sridhar Babu |   ( Updated:2024-12-15 14:42:22.0  )
ఇదో థ్రిల్లింగ్​ క్రైం స్టోరీ
X

దిశ, వెల్గటూర్ : జిల్లాలో థ్రిల్లింగ్​ క్రైం స్టోరీ వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం తెలంగాణ నుంచి కారులో వెళ్లిన నలుగురు యాత్రికులతో పాటు డ్రైవర్ ను కొంతమంది దుండగులు చితకబాది సుమారు రూ.3 లక్షల వరకు లాక్కొని విడిచిపెట్టిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్లటూరు మండల కేంద్రానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి రామ్నూర్ గ్రామానికి చెందిన వంశీ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఇద్దరూ కలిసి కారు కిరాయికి మాట్లాడుకున్నారు. కారు నడిపేందుకు తాత్కాలిక డ్రైవరుగా వెల్గటూర్ కు చెందిన మెరుగు మహేష్ ని ఏర్పాటు చేసుకున్నారు. మల్లయ్య శనివారం డ్రైవర్ మహేష్ తో కలిసి కారులో తొలుత మంథని వెళ్లాడు. అక్కడ ఒకరిని పికప్ చేసుకొని హైదరాబాద్ వెళ్లి అక్కడ మరికొందరిని కారులో ఎక్కించుకొని ఐదుగురు కలిసి మధ్యప్రదేశ్ ప్రయాణమయ్యారు.

మొదట కారు ఎక్కి వచ్చిన మల్లయ్య హైదరాబాద్​లో దిగి మిగతా వారందరిని కారులో ఎక్కించి మధ్యప్రదేశ్లో మీ అందరిని ఒకరు రిసీవ్ చేసుకుంటారని చెప్పి అతను తిరిగి వెల్గటూర్ చేరుకున్నారు. హైదరాబాద్​లో స్టార్ట్ అయిన కారు ఆగకుండా సుమారు 750 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మధ్యప్రదేశ్ చేరుకుంది. అక్కడికి వెళ్లిన వీరంతా మల్లయ్య చెప్పిన వ్యక్తిని కలుసుకున్నారు. అతన్ని కలిసిన కొద్దిసేపటికి పదిమంది ఆగంతకులు వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిన వారిని విడివిడిగా ఒక్కో రూములో బంధించి కత్తులతో బెదిరించారు. అనంతరం ఇష్టం వచ్చినట్టుగా వారిని చితకబాది వారి వద్దనున్న డబ్బును, సెల్ఫోన్లను లాక్కొని రెండు గంటలపాటు చిత్ర హింసలు చేశారు. వారి సెల్ఫోన్ల ద్వారానే ఇంటికి ఫోన్ చేయించి ఒక్కో వ్యక్తి నుంచి 50 నుంచి 70 వేల రూపాయలను దోచుకున్నారు. డ్రైవర్ ద్వారా ఓనర్ వంశీకి ఫోన్ చేయించి 50 వేల రూపాయలను ఫోన్పే ద్వారా వేయించుకున్నారు.

అనంతరం వీరందరినీ ఒకచోటికి చేర్చి వారి ముందు జింక చర్మాలతో పాటు పుర్రెలను ఉంచి ఫొటోలు తీసి వదిలేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. అనంతరం స్వరాష్ట్రానికి పయనమయ్యారు. వెళ్లేటప్పుడు హైదరాబాద్ వయా వెళ్లిన కారు వచ్చేటప్పుడు నాగపూర్ మీదుగా వచ్చి నిర్మల్ లో ఆగారు. అందరూ కారు దిగి హోటల్ కు వెళ్లి భోజనం చేశారు. డ్రైవర్ మహేష్ భోజనం చేసి కారు వద్దకు వచ్చే సరికి ఆ నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. తిరిగి హోటల్ కి వెళ్లి చూసినా కనిపించలేదు. చేసేదేమీ లేక డ్రైవర్ మహేష్ కారు తీసుకుని నేరుగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రానికి చేరుకొని జరిగిన విషయం అందరికీ చెప్పాడు. అనంతరం మొదట కారు మాట్లాడిన మల్లయ్య కు విషయం చెప్పగా అది విన్న అతడు సరే నేను చూసు కుంటానని, దీని గురించి ఎక్కువగా ఆలోచించ వద్దని చెప్పాడు.

జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో....

ఈ ఘటనలో జవాబు లేని ప్రశ్నలు ఎన్నో రేకెత్తుతున్నాయి. అసలు వీరు యాత్రకు వెళ్లారా ఏదైనా చీకటి దందా నడిపిస్తున్నారా...మొదట కారును మాట్లాడి హైదరాబాద్ వరకు వెళ్లిన మల్లయ్య వారితోపాటు ఎందుకు వెళ్ల కుండా ఇంటికి తిరిగి వచ్చాడు.... మధ్యప్రదేశ్ కు వెళ్లిన వ్యక్తులకు మల్లయ్య ఎవరిని కలవాలని చెప్పాడు...అతడిని కలిస్తే ఆగంతకులు ఎందుకు చితక బాదారు.... అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మరో వైపు వీరంతా లోకల్ గా గుప్త నిధుల వేటగాళ్లు అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా దెబ్బలు తిన్న వ్యక్తులు అంతా కలిసి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు...పైగా డ్రైవర్ కు చెప్పకుండా ఎందుకు తప్పించుకుని పారిపోయారు అనేది మిస్టరీగా మారింది.

Advertisement

Next Story