Police suicides: ఖాకీలను కలవరపెడుతున్న పోలీసుల ఆత్మహత్యలు.. మొన్న ఒకరు.. నిన్న ఇద్దరు.. నేడు ఇద్దరు

by Bhoopathi Nagaiah |
Police suicides: ఖాకీలను కలవరపెడుతున్న పోలీసుల ఆత్మహత్యలు.. మొన్న ఒకరు.. నిన్న ఇద్దరు.. నేడు ఇద్దరు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖను ఖాకీల వరుస ఆత్మహత్యలకు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే ఐదుగురు సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. మృతుల్లో ఇద్దరు ఎస్ఐలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కారణాలు ఏవైనా నెల రోజుల్లోనే వరుస ఘటనలు జరుగుతుండటంతో పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. దీంతో కేసుల దర్యాప్తుతోపాటు శాఖపరమైన ఎంక్వైరీని అంతర్గంతంగా చేస్తున్నారు.

పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు మేళాలు

డిసెంబర్ 2వ తారీకు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకోని ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త రాష్ట్రంలో దావనంలా వ్యాపించింది. ఉలిక్కిపడ్డ పోలీస్‌లు వెంటనే వాజేడుకు పరుగులు పెట్టారు. పూసూరులోని ఫెరియాడో రిసార్టులో బస చేసిన వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీష్(29) సోమవారం ఉదయం 6.37 గంటలకు తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ఆ రోజు తెల్లవారు జామున రిసార్టులోని 107వ నంబరు గది నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. హరీశ్‌ విగతజీవిగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఎస్ఐ హరీష్ కొద్ది రోజుల క్రితమే వాజేడు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 14న వరంగల్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇరుకుటుంబాలు ఈ పనుల్లో నిమగ్నమై పెళ్లి దుస్తుల షాకింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ విషాధ వార్త వారిని కుప్పకూల్చింది. అయితే ఎస్ఐ హరీష్‌కు సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై రిలేషన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఆ యువతితో రిసార్ట్‌కు వెళ్లిన ఎస్ఐతో ఆమె పెళ్లి విషయంలో గొడవకు దిగింది. అయితే ఆమె వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని తెలుసుకున్న ఎస్ఐ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఉన్నతాధికారులకు చెబుతా అంటూ సదరు యువతి బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ట్రై యాంగిల్ లవ్.. ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య

డిసెంబర్ 26.. అర్థరాత్రి మరో వార్త రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ఎస్ఐ సాయికుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ శృతి, బీబీపేట్‌లో పీఏసీఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ధ్రువీకరించారు. ముగ్గురు కూడా ఎస్ఐ కారులో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే వీరి ఆత్మహత్యకు ట్రైయాంగిల్ ప్రేమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఎస్ఐ సాయికుమార్ బీబీపేట్‌లో విధులు నిర్వహించిన సమయంలో అదే స్టేషన్‌లో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ మధ్య రిలేషన్ ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే అంతకు ముందు సదరు లేడీ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల బదిలీపై భిక్కనూర్ వెళ్లిన ఎస్ఐకి ఈ విషయం తెలియడంతో ముగ్గురు మధ్య వివాదం నడుస్తుందని ఈ నేపథ్యంలో ముగ్గురు కలిసి సమస్య పరిష్కరించుకునేందుకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ముగ్గురు చెరువు ఒడ్డున కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో క్షణికావేశంలో శృతి చెరువులోకి దూకిందని.. ఆమెను కాపాడే ప్రయత్నంలో నిఖిల్ దూకగా.. ఇద్దరికి ఈత రాక మునిగిపోయారని తెలుస్తోంది. వారిద్దరిని కాపాడే ప్రయత్నంలోనే ఎస్ఐ సాయికుమార్ సైతం ఈత రాక చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వెల్లడయింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఆదివారం ఒక్క రోజే ఇద్దరు కానిస్టేబుల్స్..

ఈ వరుస ఘటనలు మరవక ముందే ఆదివారం ఒక్క రోజే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకరు స్టేషన్ ఆవరణలోనే ఉరివేసుకోగా.. మరొకరు ఇంట్లో భార్య పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తెల్లారేసరికి వెలుగు చూసిన ఈ వరుస ఘటనలతో పోలీసులకు కలవరపాటుకు గురయ్యారు. కొల్చారం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయి కుమార్ శనివారం రాత్రి స్టేషన్ ముందున్న ఎస్సై క్వార్టర్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన సాయి కుమార్ కు సంగారెడ్డి జిల్లా జోగిపేట కు చెందిన లక్ష్మి తో వివాహం జరగడంతో జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేస్తూ నర్సాపూర్ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ మహిళ భర్త సాయి కుమార్‌ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో ఇటీవల గొడవలు జరిగాయని ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పాండారి బాలకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. బాలకృష్ణ ముందుగా పురుగుల మందు తాగి తర్వాత ఉరి వేసుకోవడంతో మృతి చెందాడు. ప్రస్తుతం భార్య, పిల్లలు విషమ పరిస్థితుల్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. వీరిద్దరేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించాడు.

ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటాం : డీజీపీ

పోలీస్ శాఖలో వరుసగా చోటుచేసుకుంటున్న పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఆత్మహత్యల ఘటనలను విశ్లేషిస్తే చాలా వరకు వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకుంటున్నారన్నారు. పర్సనల్, ఫ్యామిలీ సమస్యలతో, భావోద్వేగాలతో పోలీసుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆత్మహత్యలకు పని ఒత్తిడి కూడా ఓ కారణమై ఉండొచ్చేమోనని వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగుల ఆత్మహత్యల నివారణకు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర రంగాల వారి సహకారం కూడా తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed