బాంబు బెదిరింపు కేసులో నిందితుని అరెస్ట్​

by Javid Pasha |
బాంబు బెదిరింపు కేసులో నిందితుని అరెస్ట్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో బాంబు పెట్టానంటూ 100 నెంబర్​కు ఫోన్​చేసిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారంలో నష్టపోయిన నిందితుడు ఇలా బెదిరింపు ఫోన్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులను కోటి రూపాయలు డిమాండ్​చేసినట్టుగా తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరులోని జిన్నా టవర్స్​ప్రాంత నివాసి అయిన జైని రాధాకృష్ణ గతంలో బియ్యం వ్యాపారం చేశాడు. అయితే, వ్యాపారంలో భారీ నష్టాలు రావటంతో ప్రస్తుతం వంట వానిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు తలెత్తటం, వాటి కారణంగా భార్య విడాకులు ఇవ్వటంతో మద్యంతోపాటు అన్ని రకాలు దుర్వ్యసనాలకు బానిసయ్యాడు.

తేలికగా డబ్బు సంపాదించాలని పథకం వేసి ఈనెల 11న హైదరాబాద్​వచ్చాడు. హయత్​నగర్​ప్రాంతంలోని ఓ నిర్జన ప్రదేశం నుంచి 100 నెంబర్​కు ఫోన్​చేసి ఏసీ గార్డ్స్​లోని ఆదాయపు పన్ను శాఖ భవనంతోపాటు బషీర్​బాగ్​లోని ఆయకర్​భవన్, గాంధీనగర్, కవాడీగూడ, సికింద్రాబాద్​ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు చెప్పాడు. ఆ తరువాత ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి ఫోన్​చేసి తనకు కోటి రూపాయలు ఇస్తే ఎక్కడెక్కడ బాంబులు పెట్టానో చెబుతానన్నాడు. కాగా, ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది నుంచి ఫిర్యాదు అందుకున్న నాంపల్లి పోలీసులు సోమవారం నిందితున్ని అరెస్టు చేశారు

Advertisement

Next Story

Most Viewed