భార్య చావుకు కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు

by Shiva |
భార్య చావుకు కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు
X

దిశ, కరీంనగర్ లీగల్ : అదనపు వరకట్నం కోసం వేధించి భార్య చావుకు కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మంగళవారం తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ వారి కథనం ప్రకారం.. కొత్తపెల్లి మండలం సీతారాంపుర్ గ్రామానికి చెందిన శ్రీవాణిని రామడుగు మండలం దత్తోజీపల్లి గ్రామానికి చెందిన పెందోట అనిల్ తో 2014 సంవత్సరంలో వివాహం జరిగింది.

వివాహ సమయంలో వరకట్నం కింద శ్రీవాణి తల్లిదండ్రులు రూ.1.50 లక్షలు, ఇతర లాంచనాలు పెట్టారు. కాగా, పెళ్లైన కొద్ది రోజులు వారి కాపురం సజావుగా సాగినప్పటికీ అనిల్ తరుచూ అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో శ్రీవాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా, పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో మళ్లీ కాపురానికి శ్రీవాణి పంపించగా అనిల్ ఆమెను మళ్లీ అదనపు వరకట్నం కోసం వేధించడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.

2018 సంవత్సరం జూన్ 12 న శ్రీవాణి ఇంటికి వచ్చిన అనిల్ శ్రీవాణిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి 2018 జులై 3న సాయంత్రం ఇంటి ముందు ఉన్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. శ్రీవాణి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులను విచారించగా భర్త అనిల్ పై నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ నిందితుడు అనిల్ కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

Advertisement

Next Story

Most Viewed