ఐదు రోజులుగా వ్యక్తి శవం ఇంట్లోనే…కారణం ఏంటంటే…?

by Kalyani |
ఐదు రోజులుగా వ్యక్తి శవం ఇంట్లోనే…కారణం ఏంటంటే…?
X

దిశ, సంగారెడ్డి / సదాశివపేట : తల్లిదండ్రులు వారి పేరుపై ఉన్న మొత్తం భూమిని తన సోదరి భర్త పేరుపై చేశారని మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సదాశివపేట మండలం పరిధిలోని తంగెడపల్లి గ్రామానికి చెందిన సిరిపురం రాములు ఈ నెల 18వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సిరిపురం రాములుకు తమ్ముడు నవీన్, సోదరి రజిత ఉన్నారు. గత సంవత్సరం రాములు తమ్ముడు సిరిపురం నవీన్ చనిపోయాడు. నవీన్ కు పెళ్లి అయ్యి భార్య ఉండడంతో ఆమెకు తల్లిదండ్రులు వాటా ఇవ్వవలసి వస్తుందని రాములు సోదరి భర్త హోంగార్డు మల్లేశం పేరుపై తండ్రి సిరిపురం మాణయ్య, తల్లి సిరిపురం మాణమ్మలు వీరికున్న భూమి మూడెకరాలను సేల్ డీడ్ చేశారు.

ఇటీవల కాలంలో తల్లిదండ్రులకు భూమిలో సగం సోదరికి ఇచ్చి మిగతా సగం తనకు ఇవ్వాలని అడగగా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్థాపానికి గురైన సిరిపురం రాములు 18వ తేదీ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రాములు భార్య లక్ష్మీ మూడు నెలల గర్బవతిగా ఉండడంతో తన పరిస్థితి ఏంటని, తనకు ఆ భూమిలో వాటా ఇవ్వాలని అత్తామామలను డిమాండ్ చేస్తూ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు రాములు భావ అయిన చెల్లెలి భర్త మల్లేశంను అడిగి భూమిలో నుంచి సగం వాటా లక్ష్మీ పేరుపై రిజిస్టర్ చేయాలని కోరారు. అందుకు అంగీకరించి భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ బుక్ చేశారు. కాగా భూమి రిజిస్ట్రేషన్ చేస్తేనే అంత్యక్రియలు జరగనిస్తామని లేకుంటే జరగనివ్వమని లక్ష్మీ బంధువులు తెలిపారు. అందుకు అంగీకరించిన మల్లేశం శనివారం నుంచి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రాకపోగా పరారీలో ఉన్నారు.

ఐదు రోజులగా ఇంట్లోనే శవం..

ఆత్మహత్య చేసుకున్న రాములు భార్య లక్ష్మీ పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేస్తానని మాట ఇచ్చిన రాములు బావ హోంగార్డు మల్లేశం శనివారం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులోకి రాలేదు. ఆగ్రహించిన రాములు భార్య లక్ష్మీ బంధువులు శవానికి అంత్యక్రియలు నిర్వహించకుండా గత ఐదు రోజులగా శవాన్ని ఇంట్లోనే ఉంచారు. ఆస్తిని తల్లిదండ్రుల నుంచి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని తన భర్తకు ఇవ్వకపోవడం వల్లనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, తాను ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అని తనకు న్యాయం చేసేంతవరకు శవం అంత్యక్రియలు జరగనివ్వమని భీష్మించుకు కూర్చున్నారు. భూమి పంచాయితీ తేలేంత వరకు అంత్యక్రియలు నిర్వహించమంటూ ఐదు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచారు. దీనిపై రాములు బావమరిది కొత్తూరు గ్రామానికి చెందిన రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed