Suspicious Death: పరాయి మహిళ మోజులో భర్త.. అనుమానస్పద స్థితిలో భార్య మృతి

by Shiva |
Suspicious Death: పరాయి మహిళ మోజులో భర్త.. అనుమానస్పద స్థితిలో భార్య మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భర్త వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. కళ్లు తిరిగి పడిపోయిందని భర్త చెబుతున్నప్పటికీ.. నిమిషాల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తుందనే కోపంతో తన బిడ్డను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచెర్ల గ్రామానికి చెందిన కవితను సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన గోగుల కమలాకర్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అన్యోన్యంగా కొనసాగుతోన్న వారికి సంసారంలోకి నూతనకల్ మండల కేంద్రానికి చెందిన మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న కమలాకర్.. నాలుగేళ్లుగా ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ.. కమలాకర్ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేసింది. దీంతో భార్య కవితతో కమలాకర్ తరచూ గొడవలు పడుతున్నాడు. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు చేసి కాపురానికి పంపించారు.

భార్య పిల్లలను వదిలేసి ప్రియురాలితోనే సహజీవనం చేస్తున్న కమలాకర్ ఆదివారం రాత్రి పాతర్లపాడుకు వచ్చి గొడవపడ్డాడు. ఉదయం స్నానానికి వెళ్లి వచ్చిన కవిత.. భోజనం చేసి చేతులు కడుక్కుంటున్న సమయంలో కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే 9వ తరగతి చదువుతున్న ఆమె పెద్ద కుమారుడు తన అమ్మమ్మ, తాతకు సమాచారం అందజేశాడు. మరోవైపు భర్త కమలాకర్ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి భార్య కవితను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని ప్రకటించారు.

సమాచారం అందిన వెంటనే కవిత తల్లిదండ్రులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. తన బిడ్డ కోసం ఆతృతగా వెతికిన వాళ్లకు మార్చురీలో విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. పరాయి మహిళ మోజులో పడి తన కూతురిని పొట్టనపెట్టున్నారని కవిత తండ్రి సూర వెంకన్న కన్నీరుమున్నీరయ్యారు. ఆస్తిని అమ్మనివ్వడం లేదనే కోపంతోనే అన్నంలో విషం పెట్టి హత్య చేశాడని ఆరోపించాడు. పోలీసులకు సైతం తన బిడ్డ మరణంపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. తన అల్లుడు, ఆమె అత్తమామ కలిసి కొట్టి చంపేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Next Story