Pub G ఆడొద్దు అన్నందుకు కత్తితో దాడి.. కోపంతో ఇంటికి నిప్పుపెట్టిన బాధితుడి బంధువులు

by karthikeya |
Pub G ఆడొద్దు అన్నందుకు కత్తితో దాడి.. కోపంతో ఇంటికి నిప్పుపెట్టిన బాధితుడి బంధువులు
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్‌జీ ఆడొద్దు అన్నందుకు వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన అనంతరపురం కల్యాణదుర్గంలో చోటు చేసుకుంది. దీంతో తీవ్ర గాయాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు దాడి చేసిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చెలరేగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కల్యాణదుర్గంలో నివశించే రామాంజనేయులు పబ్‌జీ ఆడుతుండగా.. అక్కడికొచ్చిన వన్నూరుస్వామి అనే వ్యక్తి పబ్‌జీ చెత్త గేమ్ అని, అలాంటి గేమ్స్ ఆడి టైం వేస్ట్ చేసుకోవద్దని మంచి చెప్పాడు. కానీ రామాంజనేయులు వినిపించుకోకుండా వెటకారంగా సమాధానం చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చివర్లో రామాంజనేయులు కోపంతో వన్నూరుస్వామిపై ఏకంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.

వెంటనే స్థానికులు, కుటుంబసభ్యులు వన్నూరుస్వామిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం రామాంజనేయులు పరారైపోగా.. వన్నూరుస్వామి కుటుంబీకులు ఆగ్రహంతో అతడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు రామాంజనేయులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story