తలకొండపల్లిలో కొంపముంచిన ఐఏఎస్ యాప్.. వేలల్లో బాధితులు.. కోట్లల్లో నష్టం

by karthikeya |
తలకొండపల్లిలో కొంపముంచిన ఐఏఎస్ యాప్.. వేలల్లో బాధితులు.. కోట్లల్లో నష్టం
X

దిశ, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో ఐఏఎస్ అనే ఓ ఫ్రాడ్ యాప్ కలకలం సృష్టించింది. 6 నెలల క్రితం నుంచి గ్రామాల్లో ఈ యాప్‌ చాప కింద నీరులా విస్తరించింది. రూ.18,300 కట్టి ఐడీ తీసుకొని తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు నెంబర్‌తో యాప్‌లో జాయిన్ అయిన తర్వాత మరొక్కరిని జాయిన్ చేస్తే రూ.30 వేల వరకు సంపాదించుకోవచ్చని కేటుగాళ్లు నమ్మించారు. అంతేకాకుండా యాప్‌లో వచ్చే యూట్యూబ్, ఇన్‌‌స్టాగ్రామ్‌ల వీడియోలు చూసి వాటి స్క్రీన్ షాట్స్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ప్రతి వీడియోకు రూ.44 రూపాయలు ఇస్తామంటూ మరో మోసానికి తెరలేపారు. అయితే యూజర్లు వెంటనే డబ్బులు విత్‌డ్రా చేసుకోకుండా 10 రోజులు ఆగితే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవచ్చని నమ్మబలికారు.

అలాగే ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ లేకుండా కేవలం గురువారం మాత్రమే డబ్బులు విత్‌డ్రా చేసుకునేలా మరో ఫ్రాడ్ ఆప్షన్ కూడా ఇందులో పెట్టారు. అలాగే జనాలకి నమ్మకం కలిగించడం కోసం ముందుగా జాయిన్ అయిన కొంతమందికి లక్షల్లో డబ్బు విత్‌డ్రా చేయించుకోనిచ్చినట్లు తెలుస్తోంది. ఇది చూసి అనేకమంది ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి జాయిన్ అయ్యారు. అలాగే తమ సెన్సిటివ్ డేటా అయిన బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇచ్చారు. ఇక గత 20 రోజుల నుంచి ఐఏఎస్ యాప్ పనిచేయడం లేదని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే ఐఏఎస్ యాప్ కేటుగాళ్లని పట్టుకుని తమకు న్యాయం చేయాలని, మరి కొంతమంది బాధితులు నష్టపోకుండా చూడాలని వేడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఓ అంచనా ప్రకారం.. మండలంలోని ఒక్క వెల్జాల్ గ్రామంలోనే సుమారు 500 నుండి 800 వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. వెల్జాల్‌తో పాటు పరిసర గ్రామాలైన అంతారం, జూలపల్లి, వెంకటాపూర్, ఇశ్రాయపల్లి, చౌదర్పల్లి, చంద్రదాన, రాంపూర్, మాదాపల్లి గ్రామాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఈ యాప్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక తలకొండపల్లి మండలంలోని సుమారు కోటి రూపాయల మేర బాధితులు నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐఏఎస్ యాప్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే తరహా ఫ్రాడ్‌కు పాల్పడగా కొంతమంది నిందితులను కూడా పక్క రాష్ట్రాల పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed