- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్టుబడుల పేర రూ.712 కోట్లు లూటీ.. 9మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
దిశ, తెలంగాణా క్రైం బ్యూరో: పెట్టుబడుల పేర దేశవ్యాప్తంగా 712 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులకు దుబాయ్, చైనాకు చెందిన వారితో పరిచయాలు ఉన్నట్టుగా వెల్లడి కావటం గమనార్హం. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే ఇన్వెస్ట్ మెంట్ల పేర జనం నుంచి కొల్లగొట్టిన డబ్బును నిందితులు ఉగ్రవాద సంస్థ అయితే హిజ్బుత్తహ్రీర్సంస్థకు మళ్లించినట్టు దర్యాప్తులో నిర్ధారణ కావటం. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. భోపాల్, ముంబయి, లక్నో, గుజరాత్, హైదరాబాద్‌లలో ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే విచారణను ప్రారంభించినట్టు సమాచారం. హైదరాబాదం బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రల్ లో శనివారం మీడియా సమావేశంలో కేసు వివరాలను కమిషర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఇలా వెలుగులోకి..
చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తికి కొన్నిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ మెయిల్ వచ్చింది. అందులో ఇంట్లో కూర్చుని పార్ట్ టైం జాబ్ ద్వారా దండిగా డబ్బు సంపాదించ వచ్చంటూ అవతలి వ్యక్తి ఆశ పెట్టాడు. చేయాల్సిందల్లా టెలీగ్రాం యాప్‌ద్వారా మేం పంపే లింకులను చూసి రేట్ అండ్ రివ్యూ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు. ఆసక్తి ఉంటే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ట్రావెలింగ్_బూస్ట్–99.కామ్వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకొమ్మని సూచించాడు. దీంతో శివకుమార్ ఆ వెబ్సైట్లో తన వివరాలను అప్ లోడ్ చేశాడు. ఈ క్రమంలో ఈమెయిల్ పంపించిన వ్యక్తి అయిదు టాస్కులతో ఉన్న ఓ సెట్ ను శివకుమార్ కు పంపించాడు. వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి రేటింగ్ ఇవ్వాల్సిందిగా సూచించాడు. అతను చెప్పినట్టు శివకుమార్ చెయ్యగా వెయ్యి రూపాయలకు 866 రూపాయలను లాభంగా పంపించాడు. ఇలా శివకుమార్ డబ్బును ఇన్వెస్ట్ చేసిన ప్రతీసారి ఆన్లైన్ వాలెట్లో కనిపించిన విధంగా ఓ విండోలో అతను ఎంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు? ఎంత లాభాలు వచ్చాయి? ఎంత డబ్బు విత్ డ్రా చేసుకున్నాడు? అన్న వివరాలు స్క్రీన్ పై కనిపించేవి. దాంతో శివకుమార్ వెబ్ సైట్ ను పూర్తిగా నమ్మాడు.
ఈ క్రమంలో సైబర్‌నేరగాళ్లు అతనికి ముప్పయి టాస్కులతో కూడిన నాలుగు సెట్లను పంపించి వాటిని పూర్తి చేయమని సూచించారు. 25వేల రూపాయలు ఇన్వెస్ట్‌చేసి మొదటి టాస్క్పూర్తి చేయగా 20వేలు లాభంగా సంపాదించినట్టు వెబ్ సైట్ విండోలో చూపించారు. అయితే, డబ్బు డ్రా చేయటానికి మాత్రం వీల్లేదని సూచించారు. దీనిపై శివకుమార్ ప్రశ్నించగా మొత్తం నాలుగు టాస్కులు పూర్తి చేసిన తరువాత డబ్బు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. దాంతో శివకుమార్ లక్ష, రెండు లక్షల రూపాయలను పెట్టుబడులుగా పెట్టి టాస్కులను పూర్తి చేశాడు. శివకుమార్ తమ ఉచ్ఛులో పూర్తిగా చిక్కుకున్నట్టు గ్రహించిన సైబర్ నేరగాళ్లు ప్రీమియం టాస్కుల పేరుతో అతని నుంచి 25 లక్షల రూపాయలను పెట్టుబడులుగా పెట్టించారు. ఆ తరువాత డబ్బు డ్రా చేయాలంటే మరికొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి శివకుమార్ నుంచి మొత్తం 28 లక్షల రూపాయలు దండుకున్నారు. అప్పుడు అనుమానం వచ్చిన శివకుమార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
6 ఖాతాల్లోకి..
విచారణలో శివకుమార్ నుంచి సైబర్ నేరగాళ్లు మొత్తం ఆరు బ్యాంకు అకౌంట్లలోకి డబ్బు జమ చేయించినట్టుగా వెల్లడైంది. ఈ ఖాతాలన్నీ రాధికా మార్కెటింగ్ పేరుతో ఉన్నట్టుగా తేలింది. ఈ ఖాతాల్లో నుంచి నగదు వేరే బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన సైబర్ నేరగాళ్లు చివరకు ఆ మొత్తాలను దుబాయ్ లోని తమ సహచరులకు పంపించినట్టుగా నిర్ధారణ అయ్యింది. అక్కడి నిందితులు ఈ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చినట్టు వెల్లడయ్యింది.
మొబైల్ నెంబర్ ఆధారంగా..
ఈ క్రమంలో సైబర్ క్రైం పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపగా రాధికా మార్కెటింగ్ పేర ఉన్న ఖాతాలు 8948013209 నెంబర్ మొబైల్ కు లింక్ అయి ఉన్నట్టుగా తేలింది. ఈ మొబైల్ తోపాటు ఖాతాలు మహ్మద్ మునవర్ అన్న పేరుతో ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో సైబర్‌క్రైం పోలీసులు మహ్మద్ మునవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రశ్నించగా అరుల్దాస్, షా సుమైర్, షమీర్ ఖాన్ లు అతని సహచరులని తేలింది. లక్నోకు చెందిన మనీష్, వికాస్, రాజేశ్ ల సూచనల మేరకు 33 షెల్ కంపెనీల పేర వేర్వేరు బ్యాంకుల్లో తాము 61 ఖాతాలు తెరిచినట్టు మహ్మద్ మునవర్ అతని సహచరులు వెల్లడించారు. ఒక్కో ఖాతా తెరిచినందుకు తమకు రెండు లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా తెలిపారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు మనీష్ కు అందచేసినట్టు చెప్పారు.
ఇక, ఈ వివరాలు తీసుకున్న మనీష్ తనకు తెలిసిన గగన్ సహాయంతో వెబ్ డిజైన్ చేయించడంతో పాటు నయీం అనే వ్యక్తిని బ్యాంక్ ఖాతాల కో ఆర్డినేటర్ గా నియమించుకున్నట్టు పేర్కొన్నారు. నయీం ద్వారా చైనా దేశానికి చెందిన లీ లూ గువాంగ్జో, నన్యె, కెవిన్జున్తదితరులతో దగ్గరి పరిచయాలు ఉన్న అహమదాబాద్వాస్తవ్యులు కుమార్ ప్రజాపతి అతని సహచరుడు ప్రకాశ్ ప్రజాపతిలకు ఈ ఖాతాల వివరాలను మనీష్ డబ్బుకు అమ్ముకున్నట్టుగా వెల్లడించారు. ఇలా దుబయ్, చైనా దేశాలకు చెందిన ముఠా సభ్యులు కూల్‌టెక్, ఎయిర్డ్రాయిడ్యాప్స్ద్వారా బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేసినట్టుగా తెలిపారు.
మాస్టర్ మైండ్ చైనా దేశస్థులే..
వెల్లడైన వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత ముందుకు నడిపించగా డబ్బు ఆశ చూపించి జనాన్ని ఉచ్ఛులోకి లాగింది చైనా దేశస్తులేనని తేలింది. ముంబయికి చెంది దుబయ్ లో స్థిరపడ్డ ఆరిఫ్, అనాస్, ఖాన్భాయ్, పీయూష్, శైలేష్ లు జనం నుంచి కొల్లగొట్టిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా దేశస్తులకు పంపించినట్టు నిర్ధారణ అయ్యింది. ఇలా జరిగిన ప్రతి లావాదేవీకి ప్రకాశ్ ప్రజాపతికి రెండు నుంచి మూడు శాతం కమీషన్ లు ఇచ్చినట్టు తేలింది. దీంట్లో నుంచి కొంత మొత్తాన్ని కుమార్ ప్రజాపతి ద్వారా హవాలా రూపంలో గ్యాంగులోని మిగితా సభ్యులకు ప్రకాశ్ ప్రజాపతి పంపించేవాడు. ఇక, క్రిప్టో కరెన్సీ రూపంలో చైనాకు చేరిన మొత్తం నుంచి ఆ దేశానికి చెందిన రుక్సిన్ ఇంటర్నేషనల్ షెల్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఎలక్ర్టిక్బైక్లను దిగమతి చేసుకున్నట్టుగా రికార్డుల్లో చూపించి నిందితులు హవాలా ద్వారా డబ్బు చేతులు మార్చుకున్నట్టు తేలింది.
ఉగ్రవాద సంస్థలకు..
జనం నుంచి కొల్లగొట్టిన డబ్బు నుంచి కొంత మొత్తం ఉగ్రవాద సంస్థ హిజ్బుత్ తెహ్రీర్ సంస్థకు చేరినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ప్రకాశ్ప్రజాపతి హెజ్బొల్లా వాలెట్ద్వారా డబ్బును ఆ సంస్థకు మళ్లించినట్టుగా నిర్ధారణ అయ్యింది.
రంగంలోకి ఎన్ఐఏ..
ఇలా డబ్బు హిజ్బుత్ తెహ్రీర్ సంస్థకు చేరినట్టుగా వెల్లడైన నేపథ్యంలో ఎన్ఐఏకు సమాచారం ఇచ్చినట్టు కమిషనర్ ఆనంద్ చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఎన్ఐఏ బృందాలు భోపాల్, అహమదాబాద్, ముంబయి, లక్నో, గుజరాత్ తో పాటు హైదరాబాద్ లో విచారణ ప్రారంభించినట్టు సమాచారం. ఇటీవలే భోపాల్ లో పోలీసులు హిజ్బుత్ తెహ్రీర్ సంస్థకు చెందిన కొంతమందిని భోపాల్ తో పాటు హైదరాబాద్ లో అరెస్టు చేసిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన తాజా పరిణామం పోలీస్ వర్గాల్లో సైతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
అరెస్టయిన నిందితులు..
ఈ కేసులో సైబర్ క్రైం పోలీసులు ముంబయి, అహమదాబాద్, హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, నయీముద్దీన్ వాహిదుద్దీన్ షేక్, గగన్ కుమార్ సోనీ, పర్వేజ్, సమీర్‌ఖాన్, మహ్మద్మునావర్, షా సుమైర్, అరుల్దాస్లను అరెస్టు చేశారు. వీరి నుంచి 17 మొబైల్ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 22 సిమ్‌కార్డులు, 4 డెబిట్‌కార్డులు, 33 కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు, 3 బ్యాంకు చెక్‌బుక్కులు, 12, చైనా దేశానికి చెందిన కరెన్సీ, ఒక పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు.