భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.. మరొకరు పరారీ..

by Kalyani |
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.. మరొకరు పరారీ..
X

దిశ, రాజేంద్రనగర్: నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు శంకర్ పల్లి పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలియజేశారు. మహారాష్ట్ర లోని అమరావతి పాటిపురా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖాన్ షరీఫ్ ఖాన్ (41), మహమ్మద్ అదిల్ అలియాస్ మహమ్మద్ జావిద్ బావని(21), సమీర్ లు అక్రమంగా గంజాయిని తరలించడంలో భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుంచి శంకర్ పల్లి మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలించేందుకు ఒక పథకం సిద్ధం చేసుకున్నారు.

అందులో భాగంగానే నిందితులు వారం రోజుల క్రితమే మహారాష్ట్ర నుంచి బొలెరో వాహనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ సమీర్ అనే డ్రైవర్ బొలెరో వాహనాన్ని రాజమండ్రి నుంచి గంజాయిని నిలువచేసే ప్రాంతానికి తీసుకొని వెళ్లి 228 కిలోలు గల 114 డ్రై గాంజా ప్యాకెట్లను వాహనంలో నింపుకొని వచ్చాడు. అంతకు ముందుగానే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గాను వాహనంలో కొన్ని కొబ్బరి బోండాలను నింపుకుని గంజాయి ప్యాకెట్లను కొబ్బరి బొండాల కింద దాచిపెట్టి రాజమండ్రి వద్ద నిందితులకు అప్పగించాడు. గాంజా, కొబ్బరి బొండాలు ఉన్న బొలెరో వాహనాన్ని నిందితులు రాజమండ్రి నుంచి హైదరాబాద్, శంకరపల్లి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు.

ఈ విషయమై విశ్వసనీయ సమాచారంతో రాజేంద్ర నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు శంకర్ పల్లి పోలీసులతో కలిసి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిడిఎల్ ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి ఒక్కొక్కటి 2 కేజీలు కలిగిన 114 ప్యాకెట్లలో 228 కేజీల గంజాయిని, ఒక బొలెరో వాహనాన్ని, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన రాజేంద్రనగర్, శంకర్పల్లి పోలీసులను రాజేంద్రనగర్ జోన్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story