ముంబై టు హైదరాబాద్..అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..

by Aamani |
ముంబై టు హైదరాబాద్..అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..
X

దిశ, పటాన్ చెరు: నూతన సంవత్సర వేడుకలలో విక్రయించడానికి డ్రగ్స్ తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.నమ్మదగిన సమాచారం మేరకు తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులతో పాటు పటాన్ చెరు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ ముఠా ను పట్టుకున్నారు.ఈ మేరకు పటాన్ పోలీస్ స్టేషన్ లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీ చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు.వారు వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈ నెల 20వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్థానిక పోలీసులకు, తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ లో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. అదుపులోకి తీసుకొని విచారించారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన అబ్దుల్ హమీద్ షేక్, ముఖేష్ దూబే అనే ఇద్దరు వ్యక్తులు.. నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ లోని కస్టమర్లకు విక్రయించేందుకు హైదరాబాద్ చెందిన షేక్ అమీర్ అనే వ్యక్తి కోసం వెయ్యి గ్రాముల నిషేధిత ఏండీఏంఏ డ్రగ్స్ ను తీసుకొని వచ్చినట్లు తెలిపారు. దీనిని ఢిల్లీలో ఉంటున్న జిమ్మీ, జిన్ని అనే ఇద్దరు నైజీరియన్ల వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారన్నారు. ఢిల్లీలో గ్రాముకి వేయి రూపాయలకు కొనుగోలు చేసి.. హైదరాబాదులో రూ.4 వేల నుంచి 5 వేలకు విక్రయిస్తున్నారని తెలిపారు.వీరితో పాటు ముంబై కి చెందిన రాయిస్ ఖాన్ అనే వ్యక్తి సైతం నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు నేరస్తుల ద్వారా తెలిసిందని ఎస్పీ రూపేష్ తెలిపారు.

డ్రగ్స్ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులను సైతం గుర్తించడం జరిగిందని, త్వరలోనే విచారించి వారిపై సైతం చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.కోటి రూపాయల పైన ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్డిపిఎస్ చట్టం కింద ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. మరొక నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎవరైనా డ్రగ్స్ తో పాటు మాదకద్రవ్యాలు రవాణా, విక్రయిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా నార్కోటిక్ బ్యూరో (8712656777) నెంబర్ కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.ఈ సమావేశంలో డీఎస్పీలు శ్రీధర్ (తెలంగాణ నార్కోటిక్ ఆంటీ బ్యూరో), రవీందర్ రెడ్డి, సీతారాం, సిఐలు వినాయక్ రెడ్డి, రమేష్ రెడ్డి , రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story