డీకే జడ్ సంస్థ మోసం@రూ. 227 కోట్లు..

by Aamani |
డీకే జడ్ సంస్థ మోసం@రూ. 227 కోట్లు..
X

దిశ, సిటీ క్రైమ్ : ఆర్థిక స్వాతంత్ర్యం లో మీకు మేము భాగస్వామ్యం అంటూ అమాయకులను మోసం చేసిన డీకే జడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మోసం రూ. 227 కోట్ల వరకు చేరుకుంది. ఈ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్ లను గురువారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో డీకే జడ్ సొల్యూషన్స్ అధిక వడ్డీ ఆశతో కొల్లగొట్టిన వైనం బయటపడుతుంది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన వైద్యుడు అబ్దుల్ జైష్ యూ ట్యూబ్ లో డికే జడ్(డీకే జడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ ప్రమోషన్, అందులో పలువురి వక్తల ప్రసంగాలను విని ఆకర్షితుడయ్యాడు. ఈ ఏడాది జనవరిలో మాదాపూర్ లోని డికేజడ్ కంపెనీకి వెళ్లి అక్కడ ఎండీ అశ్వక్ రాహుల్, మేనేజర్లు మహమ్మద్ ఇక్బాల్, సయ్యద్ ఉమర్ , మోయిజ్, నజీర్, బిలాల్ లను కలిసారు. వారు తాము అమెజాన్ తో భాగస్వామ్యం ప్రతి రోజు 4 వేల డెలివరీలు చేస్తున్నామని, అదే విధంగా హెడ్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్ తయారు చేసే బౌల్ట్ కంపెనీలతో ఒప్పందం తో భారీగా లాభాలు గడిస్తున్నామని వివరించారు.

మా కంపెనీలో పెట్టుబడి పెడితే 8 నుంచి 12 శాతం లాభాలు ఉంటాయని నమ్మించారు. దీంతో అబ్దుల్ జైష్ కంపెనిలో రూ. 2.24 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత లాభాలు రాకపోవడంతో అతను ఈ ఏడాది జనవరి నెలలో సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలతో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గురువారం డీకే జడ్ ఎండీ అష్వాక్ రాహుల్ , అతని భార్య సయ్యద్ అయిషా నాజ్ లను అరెస్టు చేశారు. వారి ఫాంహౌజ్ లతో పాటు కార్యాలయాల్లో తనిఖీ చేసి సేకరించిన ప్రాథమిక ఆధారాలతో డీకే జడ్ సంస్థ ఏజెంట్ ల ద్వారా అమాయకులను ఆకర్షించి మొత్తం 17500 మందిని మోసం చేసి దాదాపురూ. 227 కోట్ల కొల్లగొట్టిందని అంచనా వేశారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని పోలీసులు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed