రాజస్థాన్ టు కోరుట్ల దొంగనోట్లు చెలామణి

by Sridhar Babu |
రాజస్థాన్ టు కోరుట్ల దొంగనోట్లు చెలామణి
X

దిశ, కోరుట్ల టౌన్ : రాజస్థాన్ నుండి కోరుట్ల కేంద్రంగా దొంగనోట్లు సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మెట్ పెల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు తెలిపారు. కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక వేములవాడ రోడ్ ప్రాంతంలో గల ఎస్బీఐ తండ్రియాల బ్రాంచ్ ముందు బంగారి సాయన్న అనే వ్యక్తి కొబ్బరి బోండాలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి కొబ్బరి బోండాలు కొనుగోలు చేసి రూ.500 నకిలీ నోటు ఇచ్చినట్లు తెలిసింది. దాంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా నకిలీ నోట్లను సరఫరా చేయడానికి పట్టణంలోని తిలక్ రోడ్ ప్రాంతంలో గల ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారం మేరకు ఈనెల 1న కోరుట్ల సీఐ, ఎస్సై శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడి నుండి ఐదుగురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకుని విచారించారు. రాజస్థాన్ నుండి ఓ వ్యక్తి రూ. 2 లక్షల విలువ గల రూ. 500 నోట్లు పంపించాడని, ఆ నకిలీ నోట్లను చిరు వ్యాపారుల వద్ద మారుస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు తెలిసింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని రూ. లక్ష 61 వేల విలువ గల నకిలీ నోట్లను, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుమనట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు, ఎస్సై ఎస్. శ్రీకాంత్, సిబ్బందిని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, మెట్ పెల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు.

Next Story

Most Viewed