కాబూల్‌లో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 50 మందికిపైగా గాయాలు

by GSrikanth |
కాబూల్‌లో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 50 మందికిపైగా గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో మరోసారి బాంబు దాడి సంచలనం రేపింది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో అక్కడికక్కడే 14 మంది పౌరులు దుర్మరణం చెందగా.. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి వెనుక ఇస్లామిక్ గ్రూప్ ఉగ్రవాదుల హస్తం ఉందని పలువురు భావిస్తున్నారు. కాబూల్ పోలీస్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ దీనిపై స్పందిస్తూ.. ఘటనలో సామాన్య పౌరులే ప్రాణాలు కోల్పోయారని, ఎందరు చనిపోయారనేది కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు.

కాగా, తాలిబన్లు అధికారంలోకి రాకముందు 2020 జనవరితో పాటు గతంలోనూ ఈ మసీదే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. నాటి దాడిలో మసీదు ఇమాన్ ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. కాగా, రెండు రోజుల కిందట కాబూల్‌లోని రష్యన్ రాయబార కార్యాలయమే లక్ష్యంగా తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడినట్టు అఫ్గన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బల్ఖీ తెలిపారు.

Advertisement

Next Story