ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. ఈడీ అదుపులో ఎంపీ సోదరుడు?

by GSrikanth |   ( Updated:2022-12-06 03:43:16.0  )
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. ఈడీ అదుపులో ఎంపీ సోదరుడు?
X

ఢిల్లీ లిక్కర్​ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్. ఈ స్కామ్​లో కేసులన్నీ మాఫీ చేయిస్తానంటూ ఓ ఎంపీ సోదరుడు రూ.200కోట్లతో డీల్​ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన ఈడీ అతడిని అదుపులోకి తీసుకుని ఒకరోజంతా ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని కొందరు బిగ్​షాట్స్​ ఉండటంతో వారిలో ఎవరితో డీల్​ కుదిరింది? ఏమేం హామీలు ఇచ్చారు? తదితర అంశాలన్నీ త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. విచారణ పూర్తయ్యాక ఈడీ ​పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఐ అధికారిగా చెప్పుకుని గ్రానైట్ కేసుల్ని మాఫీ చేస్తానంటూ నమ్మబలికిన నకిలీ అధికారిని సీబీఐ పట్టుకున్న తరహాలోనే ఇప్పుడు ఓ ఎంపీ సోదరుడిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ కేసులన్నింటినీ ఉన్నతాధికారులతో మాట్లాడి చిక్కులు లేకుండా చేస్తానంటూ సెటిల్‌మెంట్ వ్యవహారం నడిపించినట్లు సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఒక రోజంతా దీనికి సంబంధించి అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈడీ మాత్రం ఇప్పటివరకు ఈ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ఎంపీ సోదరుడు కావడంతో ఈ అంశాన్ని ఈడీ సీరియస్‌‌గా తీసుకున్నది. ఎవరివరితో సంప్రదింపులు జరిపారు.. ఏమేం హామీలు ఇచ్చారు? ఎంత మొత్తంలో సెటిల్‌మెంట్ చేయనున్నారు..? తదితరాలపై ఈడీ ఆరా తీస్తున్నది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో వైఎస్సార్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత (టీఆర్ఎస్) ప్రమేయం ఉన్నట్లు ఇటీవల అరెస్టు చేసిన అమిత్ అరోరా రిమాండ్ డైరీలో ఈడీ పేర్కొన్నది. రాజకీయ నాయకులకు తోడు పలువురు పారిశ్రామికవేత్తలకూ ఇందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీలు అరెస్టు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధాలు ఉన్నాయని సీబీఐ, ఈడీలు అనుమానిస్తున్నాయి. విచారణ కోసం ఇప్పటికే కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే సెటిల్‌మెంట్ కోసం ఓ ఎంపీ సోదరుడు రంగంలోకి దిగి రూ.200 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు రావడం సంచలనం రేకెత్తించింది.

ఆ ఎంపీ ఎవరు? ఆయన సోదరుడి సెటిల్‌‌మెంట్ వ్యవహారమేంటి..? తదితరాలపై త్వరలోనే క్లారిటీ రానున్నది. నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు విషయంలోనూ తొలుత అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాతనే అధికారికంగా అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఇప్పుడు ఎంపీ సోదరుడి విషయంలోనూ మొత్తం వివరాలను రాబట్టిన తర్వాతనే ఈడీ ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్.. ₹1,700 కోట్ల విలువైన బినామీ డీల్స్, నగదు

Advertisement

Next Story

Most Viewed