ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ

by Aamani |
ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ
X

దిశ, కామారెడ్డి : జిల్లా ఆస్పత్రిలో నవజాత శిశువు జన్మించిన కాసేపటికే మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన భవానికి బాన్సువాడ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిలుతో వివాహమైంది. అయితే భవాని తన స్వగ్రామమైన పాల్వంచకు ప్రసవం కోసం రాగా ఆమెకు బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడం తో మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు.

భవాని తనకు ఇబ్బంది అవుతుందని తెలుపగా కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్నా వైద్యులు వినిపించుకోలేదు. భవానికి నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. అయితే కాసేపటికే శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. తాము చెప్పినట్టుగా బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బ్రతికేదని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే బిడ్డ మృతి చెందినట్లు ఆరోపించారు.

Advertisement

Next Story