రోడ్డు ప్రమాదంలో బీజేవైఎం నాయకుడు మృతి..

by Sumithra |   ( Updated:2023-04-17 12:16:58.0  )
రోడ్డు ప్రమాదంలో బీజేవైఎం నాయకుడు మృతి..
X

దిశ, ఆర్మూర్ : ఇందూరు జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ బీజేవైఎం నాయకుడు భూసం ప్రతాప్ (45) మృతి చెందారు. పూర్తివివరాల్లోకెళితే మృతుడు భూసం ప్రతాప్ ఆయన పెద్దకుమారుడుతో కలిసి వారి వ్యక్తిగత పనిపై సోమవారం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరి వెళ్ళారు. నిజామాబాద్ వెళుతుండగా మార్గ మధ్యంలో జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామ శివారులో 63వ నంబర్ జాతీయ రహదారి పై వారి కారు టైరు బ్లాస్ట్ అయ్యింది. దీంతో కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారు డోర్ వూడిపోయి భూసం ప్రతాప్ కారునుంచి బయటపడ్డాడు. రహదారి గుండా అనుక్షణం వందలాది వాహనాలు వస్తూపోతూ ఉన్నా ఏ ఒక్కరూ కూడా గాయపడ్డ ప్రతాప్ ను ఆసుపత్రికి చేర్చలేదు. దీంతో క్షతగాత్రుడు భూసం ప్రతాప్ సుమారు 45 నిమిషాల పాటు ప్రమాదం జరిగిన స్థలంలోనే కొనఊపిరితో కొట్టుమిట్టాడినట్లు స్థానికులు తెలిపారు. 45 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఆర్మూర్ వాసులు భూసం ప్రతాప్ ను ఇందూరులోని మనోరమ ఆస్పత్రికి తరలించారు. మనోరమ ఆసుపత్రి వైద్య బృందం భూసం ప్రతాప్ ప్రాణాలు రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే భూసం ప్రతాప్ తుది శ్వాస విడిచారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతుడు ప్రతాప్ తో పాటు ప్రయాణిస్తున్న ఆయన పెద్ద కుమారుడికి సైతం తీవ్ర గాయాలు కాగా మొదట ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్రతాప్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Next Story