బోయిన్ పల్లిలో కల్తీ అల్లం పేస్ట్ స్వాధీనం

by Sridhar Babu |
బోయిన్ పల్లిలో కల్తీ అల్లం పేస్ట్ స్వాధీనం
X

దిశ, తిరుమలగిరి : పెద్ద మొత్తంలో కల్తీ అల్లం పేస్ట్ ను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ ఓల్డ్ బోయిన్ పల్లి రాజరాజేశ్వరినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 మంది నిందితులను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్, బోయిన్ పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోనీ గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్టు కంపెనీ పేరిట నకిలీ అల్లం వెల్లుల్లి వ్యాపారం నిర్వహిస్తున్న మేనేజర్ మొహమ్మద్ సమీర్ అన్సారీ, పంపిణీదారుడు మహమ్మద్ గుల్ప్రోజ్, అసిస్టెంట్ మేనేజర్ మహమ్మద్ ముక్తార్, రంజిత్ కుమార్, మోను కుమార్, బీర్వాల్ సాహు, ఇనాయత్, మహేష్ కుమార్ లను అరెస్టు చేశారు. సుమారు రూ.4 లక్షల 50 వేల రూపాయల విలువగల 1500 కిలోల వెల్లుల్లి పేస్ట్, 55 కిలోల సిట్రిక్ యాసిడ్, మిశ్రమ యంత్రం, గ్రైండర్ మెషిన్, తూకం వేసే యంత్రం, పాడైన పచ్చి వెల్లుల్లి 40 కిలోలవి 12 బస్తాలు, తేదీలు వేసే 2 స్టాంపులు, 2 ఇంక్ సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పరారీలో ఉన్న నిందితుడు మహ్మద్ షకీల్ అహ్మద్ సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి నగర్‌లో సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఖార్కానా నిర్వహిస్తున్నాడని, మహమ్మద్ సమీర్ అన్సారీ మేనేజర్‌గా, మొహమ్మద్ గల్ఫ్రాజ్ డిస్ట్రిబ్యూటర్ గా, ముక్తార్ కుక్ కమ్ అసిస్టెంట్ మేనేజర్ గా రంజిత్ కుమార్, సోను కుమార్, బిర్వాల్ సాహు, ఇనాయత్, మహేష్ కుమార్ వర్కర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. కంపెనీ నిర్వాహకుడు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నాడని, అది కూడా అపరిశుభ్రమైన స్థితిలో, సిట్రిక్ యాసిడ్ కలిపి వాటిని కుళ్లిన స్థితిలో ఉన్న ప్లాస్టిక్ టబ్‌లలో రోజుల తరబడి భద్రపరచడం, ఆపై ప్లాస్టిక్ కంటైనర్‌లలో ప్యాక్ చేయడం, ఆ ఉత్పత్తులపై నకిలీ స్టాంపులు, లేబుల్ లతో బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్ముతున్నాడని తెలిపారు.

ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ బి. లక్ష్మీనారాయణరెడ్డి, నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐలు శ్రీనివాసులు, దాసు, పి. జ్ఞానదీప్‌, సి.రాఘవేందర్‌రెడ్డి, బోయిన్ పల్లి ఎస్సై నాగేంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు వ్యాపారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసిన సిబ్బందిని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సురేంద్ర ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed