రోడ్డు ప్రమాదంలో బెజ్జంకి మండల వాసి మృతి

by Shiva |
రోడ్డు ప్రమాదంలో బెజ్జంకి మండల వాసి మృతి
X

దిశ, బెజ్జంకి : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు కారు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణం రాంనగర్ ప్రాంతానికి చెందిన రత్నం తన భార్య, కొడుకు, కూతురుతో కలిసి తన సొంత కారులో పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, అచ్చంపేట గ్రామానికి తన బంధువుల శుభకార్యానికి బయలుదేరారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర నిశాంత్ (22)ను కారు డ్రైవర్ గా తీసుకెళ్లారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవేలో డివైడర్ కు ఢీకొని, కారు డ్రైవర్ బుర్ర నిశాంత్ అక్కడికక్కడ మృతి చెందాడు. శనివారం రాత్రి 8 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో హైవే పై డివైడర్ ను ఢీకొని కారు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న రత్నం భార్యకి చేతికి ఫ్యాక్చర్ కాగా, కుమారుడు, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాడేపల్లిగూడెం ఎస్సై వీఎస్వీ భద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుర్ర నిశాంత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా బేగంపేటలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిశాంత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Next Story