వ్యక్తి దారుణ హత్య.. ప్రాణానికి ముప్పు తెచ్చిన రూ.40 వేల అప్పు..

by Kalyani |
వ్యక్తి దారుణ హత్య.. ప్రాణానికి ముప్పు తెచ్చిన రూ.40 వేల అప్పు..
X

దిశ, తలకొండపల్లి: అప్పుగా తీసుకున్న రూ. 40 వేలు ఇవ్వకపోవడంతో యాదయ్యను పథకం ప్రకారం హత్య చేశారు. తలకొండపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన చిన్న యాదయ్య(28) అనే యువకుడు రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన వెల్జాల గ్రామంలో అరుణాచల డెవలపర్స్ వెంచర్ లో గత రెండు నెలల క్రితం కూలి పనులు చేసుకోవడానికి వచ్చి అదృశ్యమైన సంఘటన కింద పోలీసులు అప్పట్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

షాద్ నగర్ లోని సివిల్ వర్క్ సూపర్ వైజర్ గా పని చేస్తున్న భూకలి కుమార్ అనే వ్యక్తి నుంచి చిన్న యాదయ్య రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తాగిన మైకంలో కుమార్ ను ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడాడు. మార్చి 18వ తేదీన కుమార్ తన బావ అయిన రాజు, స్నేహితులు షాద్ నగర్ కు చెందిన సత్యం, ఎక్కువయిపల్లికి చెందిన అనిల్ తో కలిసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెల్జాల్ గ్రామానికి చేరుకొని వెంచర్ లో కూలి పని చేస్తున్న యాదయ్యను కారులో ఎక్కించుకుని వెల్జాల్ శివారు ప్రాంతంలో గల చెట్లలోకి వెళ్లి తమ వెంట తెచ్చుకున్న ఆరు బీర్లు తాగిన తర్వాత, అప్పుగా తీసుకున్న రూ. 40 వేల విషయాన్ని మరోసారి అడగగా అతని ఫ్రెండ్స్ బెదిరించాలని కట్టెలతో కొట్టడంతో రక్తం కారుతూ స్పృహ తప్పి కింద పడ్డాడు.

చిన్న యాదయ్య చనిపోయి ఉంటాడని నిర్ధారించుకొని అతన్ని కొట్టిన కట్టెలతోపాటు, బీరు సీసాలను కారులో వేసుకొని షాద్ నగర్ నియోజకవర్గం లోని అయ్యవారిపల్లి గ్రామ శివారులో ఉన్న పాడు బడిన బావిలో యాదయ్యను బండరాయికి కాళ్ళను చేతులను తాలతో కట్టి బావిలో తోసేశారు. తలకొండపల్లిలో కేసు నమోదు చేసిన ఆమనగల్ సీఐ ఉపేందర్, తలకొం డపల్లి ఎస్సై వెంకటేష్ విచారణ నిర్వహిస్తుండగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అనుమానం వచ్చిన నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ నిర్వహించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని సీఐ పేర్కొన్నారు.

అయ్యవారిపల్లి గ్రామంలోని యాదయ్య మృతదేహాన్ని పాడుబడిన బావిలో నుంచి పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి అక్కడే వైద్యుల సహాయంతో పంచనామా నిర్వహించారు. యాదయ్య మృతికి కారణమైన కుమార్, సత్తయ్య, రాజు, అనిల్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు పేర్కొన్నారు. హత్య చేసిన సమయంలో బ్రీజా కార్, నాలుగు సెల్ ఫోన్లు, ఆరు బీరు బాటిల్స్, రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా షాద్ నగర్ చెందిన సత్యం అనే నిందితుడు గతంలో కూడా షాద్ నగర్ లోని ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story