ఈత కల్లు దొంగతనం చేశాడని నింద మోపడంతో వ్యక్తి మృతి

by Kalyani |
ఈత కల్లు దొంగతనం చేశాడని నింద మోపడంతో వ్యక్తి  మృతి
X

దిశ,దౌల్తాబాద్: ఈత కల్లు దొంగతనం చేశారని నేరం మోపి జరిమానా విధించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దౌల్తాబాద్ పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన ముత్యాల ఆంజనేయులు ( 34) గత కొంతకాలంగా ముంబాయికి వలస వెళ్లి అక్కడే పని చేసుకుంటూ ఉంటున్నాడు. 15 రోజుల క్రితం సొంత గ్రామం ముత్యంపేటకు వచ్చాడు. ఈ నెల 24న పంచమి పరుశరాములు, తోడంగి రామచంద్రంతో పాటు ముత్యాల ఆంజనేయులు గ్రామంలోని ఈతవనంలో ఈత కల్లు దొంగతనం చేశారని నేపంతో గ్రామానికి చెందిన తోడంగి ఆంజనేయులు, తోడంగి స్వామి, తోడంగి కరుణాకర్, తోడంగి చంద్రం, ఈరంగారి ఎల్లం, తోడంకి ముత్యం, తోడంగి స్వామి, తోడంగి పరశురాములు కలిసి ఈ నెల 25 వ తేదీన గ్రామ పంచాయతీ వద్ద పంచాయతీ నిర్వహించి ముగ్గురిని చితకబాదారు. రూ.2 వేల జరిమానా విధించారు.

ఈ సంఘటనతో చెయ్యని నేరాన్ని మోపారని తీవ్ర మనస్తాపం చెందిన ఆంజనేయులు సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆంజనేయులు మృతికి కారణమైన 8 మందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతుడి సోదరుడు ముత్యాల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed