Turkey-Syria Earthquake :9,500కు చేరిన మరణాలు.. గంట గంటకు పెరుగుతోన్న మృతుల సంఖ్య!

by Satheesh |   ( Updated:2023-02-08 11:40:23.0  )
Turkey-Syria Earthquake :9,500కు చేరిన మరణాలు.. గంట గంటకు పెరుగుతోన్న మృతుల సంఖ్య!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తుర్కియే, సిరియా దేశాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇరుదేశాల్లో కలిపి భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల్లో కలిపి 30 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి. ఇది, గత పదేళ్ల కాలంలో అత్యంత తీవ్రకరమైన భూకంపంగా నిలిచి.. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి వేలాది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. ఈ భారీ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర విపత్తులో 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసిన విషయం తెలిసిందే.

ఆగని భూప్రకంపనలు..

సోమవారం 7.8 తీవ్రతతో మొదటిసారి భూమి కంపించగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. బుధవారం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. ఈ ఘోర విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు భూగర్భ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ భూప్రకంపనల ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద 1,80,000 మంది చిక్కుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులుగా 25 వేల మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.

Turkey earthquake :17 గంటలు విధితో పోరాడి తమ్మున్ని రక్షించుకున్న చిన్నారి

Advertisement

Next Story

Most Viewed