కేంద్రం వారి కనుసన్నల్లోనే పనిచేస్తోంది : సీపీఎం నేత వీరభద్రం

by Shyam |
CPM leader Tammineni Veerabhadram
X

దిశ, భువనగిరి రూరల్: దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై సంఘటిత పోరాటాలు నిర్వహించాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో సోమవారం సీపీఎం మండల మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో తమ్మినేని పాల్గొని మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో నడుస్తూ.. దేశ సంపదను దోచిపెడుతోందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టుపెట్టి, పభుత్వ వనరులను కొల్లగొడుతూ.. పేదలపై పెనుభారం మోపుతోందని అన్నారు.

CPM leader Tammineni Veerabhadram

పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరిస్తూ.. హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెంచుతూ పేదల బతుకులను ఆగం చేస్తోందని అన్నారు. పెగసస్‌తో రాష్ర్టాల్లో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. పేదలు, రైతుల ప్రజల పక్షాన పోరాడుతున్న వాళ్లను ద్రోహులుగా చిత్రీకరించి జైళ్లో పెడుతున్నారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా 19 రాజకీయ పార్టీలతో ఈనెల 27న బంద్ నిర్వహించటం జరుగుతుందని, ఈ బందులో ప్రజలంతా పాల్గొని మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నాయకులు ఎండీ జహంగీర్, పైళ్ళ ఆశయ్య, కొండమడుగు నర్సింహ్మ, కూరెళ్ళ నర్సింహచారి, జంపాల అండాలు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, యాదాసు యాదయ్య, కందుల హనుమంతు, బల్గూరి అంజయ్య, బోయిని ఆనంద్, వనం ఉపేందర్, బావండ్లపల్లి బాలరాజు, కల్లూరి నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed