- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతుల భూములకు రక్షణ కవచంలా భూ భారతి: ఎమ్మెల్యే వేముల వీరేశం

దిశ, నకిరేకల్ టౌన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విశ్వాసం కల్పించే విధంగా, వారి భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చిందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు.బుధవారం పట్టణంలోని సాయిబాబా గుడి ఫంక్షన్ హాల్ ఏర్పాటుచేసిన భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు .గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతి ని తీసుకు వచ్చిందన్నారు. ధరణి పార్ట్ బి లో సుమారు పది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కొత్త చట్టంలో భూముల రికార్డుల బాధ్యత, భద్రత రెవెన్యూ శాఖ తీసుకుంతుందన్నారు.
అలాగే రైతుల భూముల హక్కులను పరిరక్షిస్తుందని తెలిపారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే భూమి ఉన్న ప్రతి రైతుకి భూధార్ కార్డును ప్రభుత్వ ఇవ్వనుందని,దీని ద్వారా ఏ సర్వే నెంబర్‌లో ఎంత భూమి ఉందో రైతుకు తెలుస్తుంది అన్నారు .ధరణి రాకముందు భూములన్నింటినీ వీఆర్వో వ్యవస్థ నిర్వహించేదని, ధరణి వచ్చిన తర్వాత వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం తీసివేసిందని, ఇప్పుడు ప్రభుత్వం తిరిగి దానిని పునరుద్ధరించనుందన్నారు. ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేదని, భూ భారతిలో కిందిస్థాయిలో ఎమ్మార్వో తప్పు చేస్తే సవరించే అవకాశం ఆర్డిఓ కు ఉందని తెలిపారు. భూముల సర్వే కోసం లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియమించనుందని, దీని ద్వారా రైతుల భూములకు హద్దులు కల్పించే అవకాశం ఉందన్నారు. గతంలో ఉన్న చట్టానికి, ఇప్పటి చట్టానికి పోలికనే లేదని, రైతులకు ఎంతో మేలు కలిగించే భూ భారతి చట్టం నిజంగా రైతుల పాలిట చుట్టమని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ తెలంగాణలో భూ భారతి చట్టం రావడం శుభసూచకమని అన్నారు. ఈ చట్టం ద్వారా రైతులకు భూదార్ కార్డు ఇవ్వడం, రికార్డుల నిర్వహణ, సవరణ వంటివి శాశ్వతంగా ఉండిపోతుందన్నారు .అలాగే ఈ చట్టంలో అప్పీల్ పద్ధతి ఉందని, ఎక్కడైనా తప్పు జరిగితే సవరించే అవకాశం చట్టంలో ఉందని, గతంలో లాగా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. రికార్డులను సవరణలు చేసే అధికారం, ప్రతి సంవత్సరం రికార్డులను భద్రపరిచే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో కాకపోతే ఆటోమేటిక్ గా మ్యుటేషన్ అవుతుందన్నారు.అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, తదితరులు మాట్లాడారు. స్థానిక తహసిల్దార్ జమీరుద్దీన్ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ భూ. భారతి ఇచ్చటపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారి శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.