Security forces: జమ్ముకశ్మీర్ లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..!

by Shamantha N |
Security forces: జమ్ముకశ్మీర్ లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) ఉగ్రదాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి. కాగా.. అక్కడ 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారే అని తెలిపాయి. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని తెలుస్తోంది. మరో ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్‌తో సంబంధం ఉందని సమాచారం. వారందరూ పాక్ కు చెందినవారే అని తెలుస్తోంది. భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడవుతోంది. మరోవైపు, అక్కడ 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువగా ఉంది. ఈ విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని భద్రతావర్గాలు పేర్కొన్నాయి.

గతంలో అమర్ నాథ్ యాత్రికులు లక్ష్యంగా

గతంలో ఉగ్రవాదులు ఎక్కువగా అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నారని జమ్ముకశ్మీర్ సీనియర్ పోలీసు అధికారి వైద్ గుర్తుచేశారు. కానీ, ఈ దాడి టెర్రరిస్టుల ప్లాన్ లో మార్పును సూచిస్తుందన్నారు. ఈ దాడి వల్ల కశ్మీర్ లో టూరిజం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. పర్యాటకులు తమ బుకింగ్స్ రద్దు చేసుకుంటారన్నారు. హోటళ్ళు ఖాళీగా ఉంటాయని.. బయటి నుండి ప్రజలు కశ్మీర్‌కు రావడానికి భయపడతారని చెప్పారు. పాకిస్తాన్ కోరుకునేది కూడా ఇదే అని అన్నారు. కశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ ఐక్యమై దీనికి వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇక, పెహల్గాంలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులను చుట్టుముట్టి.. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దాడి తర్వాత అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఉగ్రదాడి దృష్ట్యా ఢిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.



Next Story