థర్డ్ వేవ్‌ వస్తే.. దేశం అతలాకుతలం : తమ్మినేని

by Shyam |   ( Updated:2021-08-27 09:06:45.0  )
CPM leader Tammineni Veerabhadram
X

దిశ, భువనగిరి రూరల్: దేశంలో కరోనాను ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా, కార్మిక, యువజన వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలని కోరారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో కేంద్రం విఫలం చెందిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ వస్తే దేశం మొత్తం అతలాకుతలం అవుతుందని సూచించారు. ఆ పరిస్థితులు రాకుండా, వెంటనే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. పేదల పొట్టకొట్టే విధంగా నిత్యావసర ధరలు పెంచుతోందని మండిపడ్డారు.

ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మివేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సైతం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 4న అన్ని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, సెప్టెంబర్ 6న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధి విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, పలుమార్లు జిల్లాలో పర్యటించినా ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

అనంతరం యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాల్లో సాయుధ పోరాట వారోత్సవ సభలు, బైక్ ర్యాలీలు జరుపుతామని, వారి కుటుంబాలకు సన్మానాలు చేసి ఒక ఉత్సవం లాగా జరుపుతామని వారు అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ దరఖాస్తు గడువు పెంచాలని, లేకపోతే చాలామంది అర్హులు పెన్షన్‌కు దూర అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, నాయకులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, అనగంట వెంకటేశం, బండారు శ్రీరాములు, శ్రీనివాస్, గడ్డం వెంకటేష్, పంతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story