వాళ్లను తరిమికొట్టిన ఘనత ఎర్రజెండాదే

by Shyam |
CPM leader Rangareddy
X

దిశ, ఇబ్రహీంపట్నం: నిజాం నిరంకుశ పాలనను తరిమికొట్టిన ఘనత ఎర్ర జెండాదే అని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రాంచందర్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ… దున్నేవాడిదే భూమి కావాలని, వెట్టిచాకిరిని రద్దు చేయాలని 1946 నుంచి 1951 వరకు ఐదేండ్ల పాటు వీరోచితంగా సాయుధ పోరాటం జరిగిందని గుర్తుచేశారు. దీనికి నాటి కమ్యూనిస్టులు పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకటనర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, కృష్ణమూర్తి నాయకత్వం వహించారని తెలిపారు.

200 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంత ప్రజలను నిజాం వంశస్థులు చిత్రహింసలకు గురి చేశారని గుర్తుచేశారు. సాయుధ పోరాటంలో ఎదురుతిరిగి అమరుడైన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలేనని అన్నారు. ఆంధ్రా మహాసభతో ఈ సాయుధ పోరాటం ప్రజలను చైతన్యం చేసిందన్నారు. ఈ పోరాటం ద్వారా పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు. కానీ, నేడు చరిత్రను వక్రీకరించేలా నిజాంను తరిమికొట్టింది తామే అని బీజేపీ చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed