కరోనాతో సీపీఎం నేత శ్యామల్ చక్రవర్తి కన్నుమూత

by Shamantha N |
కరోనాతో సీపీఎం నేత శ్యామల్ చక్రవర్తి కన్నుమూత
X

కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, బెంగాల్ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి(76) గురువారం కరోనా మహమ్మారితో కన్నుమూశారు. గతవారం కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. ఆయన చాన్నాళ్ల నుంచి వృద్ధాప్య సంబంధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. శ్వాసలో సమస్య తలెత్తగానే ఈ నెల 1వ తేదీ నుంచి ఆయనకు వెంటిలేటర్‌ సపోర్ట్ ఇచ్చారు. కానీ, పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం శ్యామల్ చక్రవర్తి తుదిశ్వాస విడిచినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి.

పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న శ్యామల్ ట్రేడ్ యూనియన్ నేతగా సుపరిచితుడు. రాజ్యసభకు ఎన్నికైనా ఆయన ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్‌గానూ సేవలందించారు. మాజీ మంత్రి, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు శ్యామల్ మరణంతో కార్మికవర్గం, దేశంలోని వామపక్ష ఉద్యమం ముఖ్యమైన గళాన్ని కోల్పోయిందని, ఆయన స్మరణలో తమ పార్టీ జెండాలను అవనతం చేస్తామని సీపీఎం పార్టీ ట్వీట్ చేసింది.

శ్యామల్‌కు ఇతర పార్టీల్లోనూ వ్యక్తిగతంగా సన్నిహితులున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ, భావజాల వ్యత్యాసాలు మినహా శ్యామల్‌‌తో వ్యక్తిగతంగా సత్సంబంధాలు కలిగి ఉన్నారని, ఆయన తన వ్యతిరేకులనూ గౌరవించేవారని తెలిపారు. అవసరమున్నప్పుడు శ్యామల్ సహకారాన్ని ఎప్పుడూ తీసుకునేవారమని, ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.

Advertisement

Next Story