‘తెలంగాణలో బెంగాల్ సీన్.. బీజేపీకి అవకాశం ఇచ్చింది కేసీఆరే’

by Shyam |
‘తెలంగాణలో బెంగాల్ సీన్.. బీజేపీకి అవకాశం ఇచ్చింది కేసీఆరే’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీజేపీకి అపోజిషన్ స్థానాన్ని కల్పించింది సీఎం కేసీఆరే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ విప్లవవాదం నుంచి మితవాదం వైపు(బీజేపీ) వైపునకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. పరమానందయ్య శిష్యులు సూదిని మోసినట్లుగా బీజేపీ నాయకులంతా ఈటలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లి కమలం కండువా కప్పించి పార్టీలోకి చేర్చుకున్నారని ఆయన చెప్పారు.

తెలంగాణలో ఉద్యమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో కూడా విఫలమవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరాక ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలన్నారు. అదే జరిగితే వామపక్ష శక్తులు, లౌకిక పార్టీలు, కాంగ్రెస్‌తో సహా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు, కాంగ్రెస్ నేతలంతా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆలోచించకుంటే తప్పనిసరిగా వెస్ట్ బెంగాల్ రాజకీయ పరిణామాలు తెలంగాణలో పునరావృతమవుతాయని, అలా జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే అందరూ కలిసి జాగ్రత్త పడాలని నారాయణ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed