అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శనంటే ఇదే ఇమ్రాన్

by Anukaran |   ( Updated:2021-01-28 04:11:57.0  )
అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శనంటే ఇదే ఇమ్రాన్
X

దిశ,వెబ్‌డెస్క్: దూకుడు సినిమాలో హీరో మహేష్ బాబు యాక్టింగ్ కోసం బ్రహ్మానందాన్ని ఎలా వాడుకున్నాడో .. పాక్ ను హస్తగతం చేసుకోవడం కోసం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చైనా అలాగే వాడుకుంటుంది. అదెలా అంటారా..? ఓ వైపు పాక్ ఎంపీలు సైతం ఇమ్రాన్ తీరును తప్పుబడుతూనే శ్రీలంక, మలేషియాను చూపిస్తూ చైనా..ఆర్ధికంగా ఆదుకుని ఎలా ఉచ్చు బిగించిందో చెప్పే ప్రయత్న చేస్తున్నారు. కానీ ఇమ్రాన్ మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. ఒంటెద్దు పోకడలతో చైనాతో స్నేహం దేశానికి మరింత లాభమని మరింత కుండ బద్దలు కొట్టిమరీ చెబుతున్నారు.

అమెరికాను వెనక్కి నెట్టి పెద్దన్నదేశంగా చెలామణి అయ్యేందుకు చైనా ప్లాన్ వేస్తోంది. చైనాకు 14దేశాల‌తో త‌గాదాలు 12దేశాల‌తో జ‌ల‌వివాదాలున్నాయి. అందుకే వ్యూహాత్మ‌కంగా ప‌డ‌మర‌వైపు ఉన్న పాకిస్తాన్ నుంచి న‌రుక్కొస్తుంది. అత్యంత కీల‌క‌మైన గ‌ల్ఫ్,యూర‌ప్ దేశాల‌కు పాకిస్తాన్ నుంచి ద్వారంగా వినియోగించుకుంది. మ‌ధ్య ఏసియా, యూర‌ప్ దేశాల్లో వ్యాపారాన్ని విస్త‌రించుకునేలా చైనా పాకిస్తాన్ ను బ‌లిప‌శువును చేస్తుంది.

లక్షల బ్యారెళ్ల ముడిచమురును చైనాకు తీసుకెళ్లాలంటే డ్రాగన్ కంట్రీ ప్రస్తుతం అరేబియా, హిందూ మహాసముద్రం ఇలా భారత్ మొత్తం చుట్టుకుంటూ జలరవాణాద్వారా తీసుకొని వెళ్లాలి. అందుకే చైనా ఓ ప్లాన్ వేసింది. పాకిస్తాన్ – చైనా ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పేరిట పాక్ ను మచ్చిక చేసుకుంది. పాక్ ఉగ్రదేశం కాబట్టి రుణం అడిగితే ఇచ్చేందుకు ఇతర దేశాలు సంశయిస్తున్నాయి. మైత్రి దృష్ట్యా మొహమాటానికి నామమాత్రంగానే ఇరుదేశాలు పాక్ కు అప్పిస్తున్నాయి. రుణం, స్నేహం పేరుతో ఎకనామిక్ కారిడార్ కు పాక్ అనుమతిచ్చింది.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ అంత్యత ఖనిజ సంపదకు నిలయం. పాకిస్తాన్ కు దాన్ని వాడుకునే సాంకేతిక ప‌రిజ్ఞానం లేదు. దీంతో చైనా కన్ను ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై పడింది. 2016లో సైండక్ కాపర్ గోల్డ్ ప్రాజెక్ట్ పేరుతో చైనా మెటలర్జికల్ కార్పొరేషన్ పేరిట బలూచిస్తాన్ ఖనిజ సంపద దోపిడీకి తెరతీసింది. 10ఏళ్ల మైనింగ్ లీజిచ్చిన పాకిస్తాన్ చైనా వలకు చిక్కింది. సీపీఈసీ చైనా-పాక్ మైత్రికి చిహ్నమంటూ ఇమ్రాన్ ఖాన్ పదే పదే చెబుతున్నారు. పాక్ భవిష్యత్తును కాంతివంతం చేసే ప్రాజెక్ట్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే ఆ దేశమంత్రులు మాత్రం సీపీఈసీ బలిపీఠం సిద్ధం అవుతుందంటూ తరచూ వ్యాఖ్యానిస్తున్నారు.

కెల్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ టార్బ్స్ లెక్కల్ని చూపిస్తున్నారు. కెల్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ లెక్కల ప్రకారం చైనా గత రెండు దశాబ్ధాలుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు చాలా తెలివిగా ప్రతీచోటా లాభాల్ని పొందింది. అప్పులిచ్చి ఆయా దేశాలపైన పెత్తనం చేయడం చైనా లక్ష్యం. చైనా నుంచి రుణాలు పొందిన మలేషియాతో శ్రీలంకతో పాటు మరిన్ని దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. కష్టాల్లో కూరుకుపోయి దివాలా తీసిన మలేషియాకు చైనా అప్పిచ్చింది. కానీ ఆ అప్పును మలేషియా తీర్చలేకపోవడంతో అందుకు బదులుగా చైనా.. మలేషియాలోని రైలు, రోడ్లు, పైప్ లైన్ ప్రాజెక్ట్ లను భారీగా స్వాధీనం చేసుకుంది. ఇక శ్రీలంక విషయానికొస్తే హంబంటోటా ఓడరేవు, కొత్త విమానాశ్రయం, బొగ్గు విద్యుత్ ప్లాంట్, రహదారి నిర్మాణ ప్రాజెక్ట్ తో పాటు రహదారుల్ని నిర్మించేందుకు ప్రయత్నించింది. అందుకు చైనా శ్రీలంకకు సుమారు 4.8బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. 2016నాటికి ఈ రుణం 6 బిలియన్ డాలర్లు పెరిగిపోయింది. దీంతో శ్రీలంక తాను తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేనని చేతులెత్తేసింది. దీంతో చైనా..,శ్రీలంకకు చెందిన హంబంటోటా ఓడరేవును చైనాకు చెందిన మర్చంపోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీకి 99సంవత్సరాలు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. 2017లో ఈ పోర్ట్ ను చైనా కంపెనీకి 1.12లక్షలకు లీజుకిచ్చేసింది. దీంతో పాటు సమీపంలో ఉన్న 15వేల ఎకరాల భూమిని చైనా పారిశ్రామిక జోన్ కింద వినియోగించుకుంటుంది.

ఇప్పుడు సీపీఈసీ ప్రాజెక్ట్ పూర్తైతే పాక్ పరిస్థితి కూడా అలాగే అవుతుందని పాక్ ఎంపీలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పాక్ లో సీపీఈసీ ప్రాజెక్ట్ లు కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించి పాకిస్తాన్ 46 బిలియన్ డాలర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అదికాస్తా 87బిలియన్ డార్లకు చేరే అవకాశాలున్నాయి. సీపీఈసీ పూర్తయితే పారిశ్రామిక సంస్థలకు అనుకూలత పెరిగి, పాక్ ఆర్ధికాభివృద్ధి సాధ్యమని చెబుతున్నా..నిపుణులు మాత్రం ఉగ్రదేశపు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటుంది. విదేశాల నుంచి తెచ్చిన అప్పులన్నీ కరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ పాక్.. చైనా నుంచి అప్పులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో రుణ భారం పేరుతో చైనా తమదేశంపై ఇంకెన్ని కుట్రలు చేస్తోందనని పాక్ ప్రజలు భయపడుతున్నారు

Advertisement

Next Story

Most Viewed