ఇన్‌స్టా యాప్స్‌ అన్నీ మోసమే : సీపీ సజ్జనార్

by Sumithra |   ( Updated:2020-12-22 05:50:37.0  )
ఇన్‌స్టా యాప్స్‌ అన్నీ మోసమే : సీపీ సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయి ఆన్‌లైన్‌లో అప్పులు చేసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్ వేర్ సునీల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నకిలీ ఇన్‌వాయిస్‌లతో బ్యాంకులకు బురిడీ కొట్టించినట్టు గుర్తించారు. అంతేగాకుండా సునీల్ కాల్‌డేటా ఆధారంగా నిర్వాహకులను గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో యాప్స్ ను గుర్తించి… బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఆరుగురు నిర్వాహకులను అరెస్ట్ చేయగా, పైసాలోన్, పిగీ బ్యాంక్, బిల్ క్యాష్, ఉదర్‌లోన్, లోన్‌ట్యాప్, స్లిప్పెట్, ఫ్లెక్సీ క్యాష్‌ యాప్‌లను పోలీసులు గుర్తించారు. మొత్తం 16 యాప్‌లపై సీసీఎస్ పోలీసులు పూర్తి సమాచారం సేకరించారు.

ఈ 16 యాప్‌ల కోసం పనిచేస్తున్న నాలుగు కాల్ సెంటర్లను ఇప్పటికే సీజ్ చేశారు. అంతేగాకుండా ఈ ఇన్‌స్టా యాప్స్ (ఇన్‌స్టంట్‌ లోన్ యాప్స్) కోసం పనిచేస్తున్న 1100 మంది ఉద్యోగులకు ఈ సందర్భంగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ.. ఇన్‌స్టా పేరుతో ఉన్న యాప్స్‌ అన్నీ మోసపూరితమైనవే అని అన్నారు. క్యాష్ మామా, లోన్‌జోన్, ధనాధన్ పేర్లతో లోన్స్‌ మంజూరు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. దీనిని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రెండు కంపెనీల్లో లక్షన్నర మంది క్లయింట్‌లు యాక్టీవ్‌గా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.

Advertisement

Next Story