ఆ టీచర్‌కు ‘క్వారంటైన్ సెంటరే క్లాస్ రూమ్’

by vinod kumar |
ఆ టీచర్‌కు ‘క్వారంటైన్ సెంటరే క్లాస్ రూమ్’
X

దిశ, వెబ్‌డెస్క్‌: కరోనా వల్ల ఇప్పటికే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక స్టూడెంట్స్ అయితే తమ భవిష్యత్తు కోసం పరీక్షల మాట పక్కన పెట్టి పైతరగతుల కోసం ‘ఆన్‌లైన్ క్లాసుల’ బాట పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయునికి కరోనా వస్తే? ఆ విద్యార్థుల చదువులకు మళ్లీ బ్రేక్ పడ్టట్టే కదా! కానీ, లడ‌ఖ్‌లోని లేహ్‌కు చెందిన కైఫయ‌త్ హుస్సేన్ క్వారంటైన్ సెంటర్ నుంచే విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లేహ్ ప్రాంతానికి చెందిన మ్యాథ్స్ టీచర్ కైఫయ‌త్ హ‌స్సేన్‌కు ఇటీవలే కరోనా పాజిటివ్ రావడంతో అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయినా తన ప్రాణం గురించి ఆలోచించకుండా.. విద్యార్థులు పాఠాలు మిస్ కాకూడదనే ఉద్దేశంతో అక్కడే నుంచి లెక్కల్లో చిక్కులు వివరిస్తున్నారు.

లేహ్ జిల్లాలో ‘చుషాట్’ ఓ చిన్న గ్రామం. ఇరాన్‌కు తీర్థయాత్రకు వెళ్లిన చాలామంది చుషాట్ గ్రామస్తులు ఫిబ్రవరిలో తిరిగొచ్చారు. అయితే అందులో చాలామందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలోని స్కూల్ ప్రిన్సిపాల్ ‘దవా’కు కూడా పాజిటిల్ వచ్చింది. అదే స్కూళ్లో లెక్కల మాస్టారుగా పనిచేసే కైఫయత్‌కు ప్రిన్సిపాల్ నుంచి కరోనా సోకడంతో లేహ్‌లోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ‘మొదట నాలో కరోనా లక్షణాలు కనిపించలేదు. కానీ, విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టకూడదనుకుని, స్వచ్ఛందంగా వెళ్లి టెస్టు చేయించుకున్నాను. దురదృష్టవశాత్తు నాకు కరోనా అని తేలడంతో షాకయ్యాను’ అని కైఫయత్ తెలిపారు.

విద్యార్థుల కోసం ఆన్‌లైన్ పాఠాలు:

‘ఐసోలేషన్ సెంటర్‌కు నా ఫోన్, దుస్తులతోపాటు పుస్తకాన్ని కూడా తీసుకెళ్లాను. మొదటి రెండు రోజులు చాలా నెగెటివ్ థాట్స్ నన్ను డిస్టర్బ్ చేశాయి. వెంటనే నా విద్యార్థుల గురించి ఆలోచించాను. ఇక్కడ ఎంతకాలం ఉంటానో తెలియదు. నా వల్ల వాళ్ల చదువులు వేస్ట్ కాకూడదని అనుకున్నాను. దాంతో అధికారులతో మాట్లాడి ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి తీసుకున్నాను. దాంతో వైఫై, బోర్డు సమకూర్చారు. జూమ్ యాప్ ద్వారా రోజూ క్లాసులు చెప్పడం ప్రారంభించాను. యాభై మంది స్టూడెంట్స్ నా పాఠాలు వింటున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు చెబుతున్నాను. ఇది నా జాబ్ మాత్రమే కాదు. నా ప్యాషన్. వాట్సాప్ ద్వారా క్వశ్చన్స్ పంపిస్తుంటాను. రెగ్యులర్‌గా విద్యార్థులు నాకు ఫోన్ చేసి డౌట్స్ అడుగుతారు. ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. నేను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అస్సలు లేదు’ కైఫయత్ పేర్కొన్నారు.

భారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంస:

‘ప్రమాద‌క‌ర క‌రోనా వైర‌స్‌తో పోరాడుతూ.. తన విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్న కైఫయత్ పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయ‌న కృషి అభినందనీయం’ అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. ఆయన వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

Advertisement

Next Story