మంత్రి తనిఖీ సమయంలోనే వైద్యం అందక వ్యక్తి మృతి

by Shamantha N |   ( Updated:2021-04-13 21:36:59.0  )
మంత్రి తనిఖీ సమయంలోనే వైద్యం అందక వ్యక్తి మృతి
X

రాంచీ: రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఆస్పత్రికి వచ్చి అక్కడ తనిఖీలు చేపడుతున్న సమయంలో ఆయన సేవలో తరించిన వైద్యులు.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ దారుణం జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన ఒక వ్యక్తికి ఇటీవలే కరోనా సోకడంతో ఆయన బంధువులు అక్కడే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో అతడిని రాంచీలోని సదర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అతడిని చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించారు. ఆరోగ్య శాఖ మంత్రి తనిఖీలకు వస్తున్నారనే సాకుతో సదరు వ్యక్తి బంధువులను బయటే నిలిచిఉంచారు.

ఇంతలోనే అక్కడికి చేరిన మంత్రి బన్నా దాస్ గుప్తా ఆస్పత్రికి వచ్చి లోపల తనిఖీలు నిర్వహించారు. ఉదయమనగా లోపలికి వెళ్లిన మంత్రిగారు.. సాయంత్రం దాకా గానీ బయటకు రాలేదు. తీరా ఆయన బయటకు వచ్చేసరికి ఒక యువతి మంత్రికి అడ్డం తిరిగింది. మంత్రి సేవలో తరించిన వైద్యబృందం తమ నాన్నను ఆస్పత్రిలోకి చేర్చుకోలేదని, దాంతో ఆయన చికిత్స అందక మరణించాడని నిలదీసింది.

‘మంత్రిగారు..! మేము డాక్టర్ల కోసం అరుస్తూనే ఉన్నాం. కానీ నా తండ్రికి చికిత్స అందించడానికి ఒక్క డాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఆయనను స్ట్రెచర్ మీద ఉంచి చాలాసేపు బయటే నిలుచుని ఉన్నాం. సకాలంలో వైద్యం అందక ఆయన మరణించాడు. మీరు (మంత్రిని ఉద్దేశిస్తూ) నా తండ్రిని తిరిగి ఇవ్వగలరా..?’ అంటూ మృతుడి కూతురు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓట్లు అడిగేందుకే తమ వద్దకు వస్తారని, మిగిలిన సమయాల్లో ప్రజలను పట్టించుకోరా..? అని నిలిదీసింది. కాగా, దీనిపై బన్నా దాస్ గుప్తా స్పందిస్తూ.. సమస్యలు ప్రతిచోటా ఉంటాయని, వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed