- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వృత్తికి దూరం.. విశ్వబ్రాహ్మణులకు అష్టకష్టాలు
దిశ, తెలంగాణ బ్యూరో : చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి. ఆది నుంచి వ్యవసాయరంగానికి వారే కీలకం. తుమ్మ చెట్టు కొమ్మలను తీసుకొస్తే బడిశెతో చెక్కి నాగలి తయారు చేసేవారు. వారు ముందుంటేనే సాగు సాగేది. అయితే కాలక్రమేణ వ్యవసాయరంగంలో యంత్రీకరణ రావడంతో ఉపాధిపై ప్రభావం చూపింది. నాగలితో దున్నేవారు లేకపోవడం… ఉన్నవారు కూడా ఇనుప వస్తువులను కొనుగోలు చేసి సాగుకు ఉపయోగించడంతో పనులు లేక జీవనోపాధి కరువైంది. 80శాతం వరకు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలసలు పోయి ఫర్నీచర్, గృహాలకు సంబంధించిన వస్తులను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిని గతేడాది నుంచి కరోనా వెంటాడుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పోషణ గగనమైంది.
విశ్వకర్మల / విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగి. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులు 10లక్షలకు పైగా ఉన్నారు. కలపతో వివిధ వస్తువులను తయారుచేయడం వీరి వృత్తి. వడ్రంగి పని చేసేవారు ఊరూరా ఉంటారు. వీరు వ్యవసాయరంగానికి ఉపయోగించే వస్తువులతో పాటు ఇళ్లకు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇళ్ల పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించే చెక్క వస్తువులు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా దేశంలో కూడా విశ్వబ్రాహ్మణులు మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. చేతిలో పని ఉంటే దేశంలో ఎక్కడికైనా వెళ్లి బతకవచ్చు, కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెత ఉంది.
రెడీమేడ్ వస్తువులతో ఎఫెక్ట్
ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్ టేబుళ్లు, మంచాలు, వ్యవసాయానికి కావాల్సిన నాగలి, కాడి, మేడి, బండి, ఇలా ఒకటేంటి అన్నింటినీ వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్ తలుపులు, డైనింగ్ టేబుళ్లను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. దీనికితోడు కొన్ని కులాల వారు కూడా వడ్రంగి పని చేస్తున్నారు. దీంతో నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రావడం లేదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తినే నమ్ముకుని వందలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు నౌకర్లుగా, గుమస్తాలుగా చేరుతున్నారు.
కరోనాతో ఇక్కట్లు..
వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులపై కరోనాపై ఎఫెక్ట్ పడింది. అసలే అంతమాత్రంగానే ఉన్నవారి ఆర్థిక పరిస్థితిపై మరింత దారుణంగా మారింది. ఉపాధి లేకపోవడం, లాక్ డౌన్ విధించడంతో షాపులను మూసివేతతో ఒకవైపు మడిగల కిరాయి కట్టలేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా వృత్తిని వీడగా, ఇదే పరిస్థితి కొనసాగితే మిగతా వారు కూడా వృత్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయినా ప్రభుత్వం మాత్రం విశ్వబ్రాహ్మణులకు బడ్జెట్ కేటాయిస్తామన్న రూ.250కోట్లు కేటాయించకపోవడం, వారిని కష్టకాలంలో ఆర్థిక చేయూత నిచ్చి ఆదుకోక పోవడంతో వృత్తికి దూరమయ్యే అవకాశాలున్నాయి.
డిమాండ్లు..
విశ్వకర్మ సంక్షేమ కార్పొరేషన్ రూ.1000 కోట్ల నిధులతో ఏర్పాటు చేయాలి. కొవిడ్ లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విశ్వబ్రాహ్మణులకు తక్షణం రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలి. అనువంశిక సంస్కృతి, సాహిత్యాలు, అర్చక పౌరోహిత్యం, వాస్తు, జ్యోతిష్య పాండిత్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి జిల్లాలో విశ్వకర్మ వేదపాఠశాలలు నెలకొల్పాలి. ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో విశ్వకర్మ కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వం నిర్మించాలి.
జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. ఎమ్మెల్యే, నామినేటెడ్ స్థానాల్లో అవకాశమివ్వాలి. మహిళలకు బ్యాంకు రుణాలతోపాటు టైలరింగ్, పెయింటింగ్, బ్యూటీపార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్, శారిమగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలి. వితంతు విశ్వకర్మ మహిళలకు రూ.3వేల పెన్షన్ ఇవ్వాలి.సెప్టెంబర్ 17 న విశ్వకర్మ యజ్ఞమహోత్సవం ప్రభుత్వం నిర్వహించాలి. విశ్వకర్మ జయంతి రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించాలి. 50ఏళ్లు నిండిన విశ్వబ్రాహ్మణుడికి రూ.3వేల పింఛన్ ఇవ్వాలి. దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాకు విశ్వకర్మ అర్చక, పురోహితులను నియమించాలి.
వెయ్యికోట్లతో విశ్వకర్మ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
వడ్రంగి(విశ్వబ్రాహ్మణులు) వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కరోనాతో గతేడాది నిర్మాణ రంగం నిలిచిపోవడంతో పనులు లేవు. దీంతో షాపుల కిరాయిలతో పాటు ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వృత్తికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు రూ.వెయ్యి కోట్లతో విశ్వకర్మ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వృత్తిపై ఆధారపడిన వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చేలా ఆదుకోవాలి. -కుందారం గణేష్ చారి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యసంఘం
బ్యాంకు రుణాలివ్వాలి
నాకు ఊహ తెలిసిన నాటి నుంచి వడ్రంగి వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నా. వారసత్వంగా వచ్చింది. కరోనాతో పనులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సంఘాలకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు ఇచ్చి ఆదుకుంటుంది. కానీ మాకు ఇవ్వడం లేదు. కిటికీలు, మంచాలు, తలుపులు, గృహంలో వినియోగించే వస్తులంటిని కొంతమేరకు యంత్రాలతో తయారు చేస్తున్నాం. కనీసం కరెంటు బిల్లులు కూడా మాఫీ చేయడం లేదు. వృత్తి మనుగడ సాగాలంటే కనీసం బ్యాంకులతోనైనా సబ్సిడీపై రుణాలిచ్చి ఆదుకోవాలి. -పడకంటి నర్సింహాచారి, రాష్ట్ర కార్యదర్శి, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యసంఘం
విశ్వకర్మ వేదపాఠశాలలు నెలకొల్పాలి
పనులు లేక చాలా మంది వృత్తిని వీడుతున్నారు. వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం అనువంశిక సంస్కృతి, సాహిత్యాలు ,అర్చక పౌరోహిత్యం ,వాస్తు ,జ్యోతిష్య పాండిత్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి జిల్లాలో విశ్వకర్మ వేదపాఠశాలలు నెలకొల్పాలి. భవిష్యత్ తరాలకు బాట వేయాలి. అదే విధంగా రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తే మాకు గుర్తింపు లభిస్తుంది. -కమ్మరి మహేష్ చారి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విశ్వకర్మ సంఘం
పస్తులుంటున్నాం..
ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత చదువులు చదువలేక 10వ తరగతితోనే మానేశా. గత 15ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నా. కరోనాకు ముందు రోజుకు రూ.400 నుంచి రూ.600 వరకు సంపాదించేవాడిని. గతేడాది నుంచి పనులు లేవు. ఇంటి అద్దె తో పాటు కుటుంబ పోషణ భారంగా మారింది. కొన్ని సమయాల్లో పస్తులుంటున్నాం. ఏవరినైన పని అడిగితే లేదు అని చెబుతున్నారు. ప్రభుత్వమే మా కుటుంబాన్ని ఆదుకోవాలి. -మారోజు శ్రీనివాస్, వడ్రంగి