దండకారణ్యంలో కరోనా టెర్రర్.. మావోయిస్టులు టార్గె‌ట్‌గా పోలీసులు మాస్టర్ ప్లాన్

by Sridhar Babu |   ( Updated:2021-06-24 21:31:56.0  )
COVID-19 hits Maoists
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: కాలుష్యం లేని దండకారణ్యంలోకి కరోనా వైరస్ చొరబడింది. ఎంతమందికి సోకిందో తెలియదు గానీ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు పాజిటివ్ బారిన పడి మృతి చెందారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారంటూ ఇంతకాలం పార్టీ చెప్పినా.. తాజాగా ఇద్దరు అగ్రనేతలు కరోనాతోనే మరణించినట్లు వచ్చిన ప్రకటన ధృవీకరించింది. ఇటీవల కాలంలో సంతల్లో భారీస్థాయి బహిరంగ సభలు, మీటింగ్‌లు పెట్టడం ద్వారానే వారికి వైరస్ అంటుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపించాయి. చనిపోయింది ముగ్గురే అయినా.. పదుల సంఖ్యలోనే వైరస్ బారిన పడి ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పట్టణాల నుంచి సంతల్లోకి.. అక్కడి నుంచి అడవుల్లోకి వ్యాపించిన ఈ వైరస్ ఆదివాసీలు, గిరిజనులనే కాక మావోయిస్టు పార్టీ కేడర్‌కు కూడా అంటుకుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అవకాశంగా మల్చుకున్న పోలీసులు తమదైన శైలిలో మావోయిస్టు కుటుంబ సభ్యులను, బంధువులను స్వయంగా కలుస్తూ లొంగుబాటు యత్నాలను ముమ్మరం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసేలా సహకరించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కరోనా బారిన పడి వైద్య సేవల కోసం ఫోన్లు చేస్తారేమోననే ఉద్దేశంతో గ్రామాల్లోని వీరి ఫోన్లపై నిఘా వేశారు. దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాలు, ఆదివాసీ గూడేల్లో పోలీసులు దృష్టి సారించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిపైనా కన్ను వేశారు.

కరోనా కాటుకు ముగ్గురి మృతి

మావోయిస్టు పార్టీ కేడర్‌కు కరోనా సోకిందంటూ బస్తర్ ఐజీ సుందర్ రాజు వారం రోజుల క్రితం ప్రకటన చేయడం, చికిత్స కోసం ఆస్పత్రిలో చేరి ఐతు అనే నాయకుడు చనిపోయాడంటూ ఖమ్మం జిల్లా ఎస్పీ సునీల్ దత్ మీడియాకు వివరించడం లాంటివి వాస్తవం కాదంటూ ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మూడు రోజుల క్రితం ప్రకటన ఇచ్చారు. కానీ ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు భారతక్క అలియాస్ సారక్క కరోనా కారణంగానే చనిపోయారంటూ రాష్ట్రకమిటీ ప్రతినిధి జగన్ గురువారం ధృవీకరించారు. గత వారం చికిత్స పొందుతూ చనిపోయిన ఐతుకు కూడా కరోనా సోకిందని క్లారిటీ ఇచ్చారు. దీంతో మావోయిస్టు పార్టీ కేడర్‌కు, లీడర్లకు కూడా కరోనా సోకిందనేది స్పష్టమైంది. అడవిలోకి సైతం కరోనా వైరస్ చొరబడిందని తేలిపోయింది.

సంతల ద్వారానే వ్యాప్తి

అడవుల్లోకి కరోనా వైరస్ సంతల ద్వారానే వ్యాపించిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సరుకులను కొనుగోలు చేయడానికి గిరిజన గ్రామాల షావుకారులు పట్టణాలకు వెళ్ళడం, అక్కడి నుంచి వారపు సంతలకు వచ్చే ఆదివాసీలు, గిరిజనులకు వ్యాపించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ దళాలు సంతల్లోకి వచ్చి భారీ మీటింగులు పెట్టిన తర్వాతనే కరోనా బారిన పడినట్లు పోలీసుల వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. పట్టణాల నుంచి సంతలకు, అక్కడి నుంచి గ్రామాల్లోని ఆదివాసీలు, గిరిజనులకు చివరకు మావోయిస్టు దళాలకు కూడా వ్యాపించినట్లు ఆ పార్టీ ప్రకటనల ద్వారా స్పష్టమవుతున్నది.

అంచనాకు అందని పాజిటివ్ కేసులు

మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు కరోనా బారిన పడి చనిపోయినట్లు ఆ పార్టీ ప్రతినిధులే అధికారికంగా స్పష్టం చేసినందున ఇంకా ఎంత మందికి పాజిటివ్ సోకి ఉండవచ్చన్న చర్చలు పోలీసు వర్గాల్లో మొదలయ్యాయి. వందల సంఖ్యలోనే వైరస్ బారిన పడి ఉండొచ్చని, ఆదివాసీ ప్రజలు వాడే నాటు వైద్యంతోనే సరిపెట్టుకుంటున్నారని, చివరకు నయం కాకపోవడంతో సరిహద్దు గ్రామాల్లోని ఆర్ఎంపీ డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటున్నారని ఖమ్మం జిల్లా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడడంతో జిల్లా కేంద్రాలకు వస్తున్నారని, ఆ ప్రకారమే ఐతు విషయం గమనంలోకి వచ్చిందని ఎస్పీ పేర్కొన్నారు. దంతెవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్, గడ్‌చిరోలి తదితర జిల్లాల్లోని దళాలకు కూడా వైరస్ వ్యాపించి ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి.

పోలీసుల నిఘా ముమ్మరం

వైరస్ బారిన పడిన మావోయిస్టులు గ్రామాల్లోని ఆర్ఎంపీ డాక్టర్లను కలిసే అవకాశం ఉందని అనుమానిస్తున్న పోలీసులు అర్థం కాని తీరులో నిఘా వేసినట్లు సమాచారం. గ్రామాల్లోని ఆదివాసీల మద్దతుతో వారి ఇండ్లలోనే తలదాచుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అడవుల్లో నాటు మందులకు నయం కాకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో బైటకు వస్తున్నారని భావిస్తున్న పోలీసులు.. హిట్‌ లిస్టులో ఉన్నవారి కుటుంబ సభ్యులను, బంధువులను కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. కరోనా సోకిందని, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, బైటకు వస్తే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తామని.. ఇలా రకరకాలుగా కౌన్సిలింగ్ సమయంలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.

గతంలో జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా నిర్వహించిన పలు రకాల ‘అభియాన్‘లు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కరోనా వైరస్‌ను మంచి అవకాశంగా మల్చుకుని నిత్యం కుటుంబ సభ్యులు, బంధువులను కలుస్తున్నట్లు తెలిసింది. వారికి వచ్చే ఫోన్లపై కూడా దృష్టి పెట్టినట్లు జిల్లా స్థాయి నిఘా వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు తల్లి అమృతమ్మను కలిసిన రామగుండం ఎస్పీ ప్రస్తుతం ఉద్యమంలో రహస్య జీవితం గడుపుతున్న మల్లోజుల వేణుగోపాల్‌ను లొంగిపోయేలా చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఆదివాసీ గ్రామాల్లో కరోనా కేసులను విశ్లేషిస్తూ కొత్త వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వైద్యారోగ్య సిబ్బంది ద్వారా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మావోయిస్టు దళాల్లో కరోనా భయం

కరోనా వైరస్ పట్టణాల్లోని ప్రజల జీవితాలను అతలాకుతలం చేసినట్లే ఇప్పుడు దండకారణ్యంలోని మావోయిస్టులను సైతం వణికిస్తున్నది. పరిస్థితి విషమించి ఎప్పుడు మృత్యువాత పడాల్సి ఉంటుందోననే ఆందోళనలు దళ సభ్యుల్లో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వైరస్ సోకిందేమోననే అనుమానంతో కాస్త సుష్తీ చేసినా వారి పక్కన ఉండడానికి తోటి దళ సభ్యులు కూడా సిద్ధపడడం లేదని పేర్కొన్నారు. వైద్యం, ఇతర సాయం చేయడానికి కూడా భయపడుతున్నారని, కరోనా బారినపడ్డారేమోనని దాదాపు నిర్ధారణకు వచ్చినవారి దగ్గరకు వెళ్ళడానికి ముందుకు రావడం లేదని కూడా తెలిపారు.

సరైన రక్షణ ఉపకరణాలు అందుబాటులో లేకపోవడం, వైరస్ వ్యాప్తి నివారణకు అవకాశం లేని పరిస్థితులు, అవసరమైన మందులు లేకపోవడం లాంటివన్నీ వారికి వ్యాపించడానికి కారణమవుతున్నాయన్నది పోలీసుల విశ్లేషణ. చిన్నస్థాయి పట్టణాల నుంచి మందులు కొనుక్కుని వెళ్ళే గ్రామస్తులను సైతం పోలీసులు ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. కరోనా బారిన పడిన మావోయిస్టు పార్టీ దళాలు ఒకింత ఆందోళనలో ఉంటే పోలీసులు మాత్రం వారిని పట్టుకోడానికి, లొంగిపోయేలా చేయడానికి ఈ పరిస్థితులు అనువైనవని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed