- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాపకింద నీరులా కోవర్టులు.. హుజురాబాద్‌లో 'లీక్' రాజకీయం
దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ఎవరు.. ఎప్పుడు.. ఏ కండువా వేసుకుని వస్తున్నారో తెలియని గందరగోళం! నిన్నటిదాకా ఒకరి వెంట ఉన్న లీడర్లు అంతలోనే కండువా మార్చేస్తున్నారు. మరో పార్టీ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పది, ఇరవై మంది ఒక్క దగ్గర కూర్చోని ఏం మాట్లాడారో వెంటనే రెండు పార్టీల నేతలకు తెలిసిపోతున్నది. దీంతో ప్రత్యర్థి పార్టీ నేతలు అక్కడికి వచ్చి బేరాలకు దిగుతున్నారు.. వాళ్ల కన్నా రెండు లక్షలు ఎక్కువే ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు.’’ ఇవి హుజూరాబాద్ మండలం చెల్పూరుకు చెందిన ఓ దుకాణదారుడి మాటలు. తమ కుల సంఘానికి ఇప్పటికే రెండు పార్టీల నుంచి వచ్చిన ఆఫర్ ను బహిరంగంగానే వ్యక్తపర్చాడు. ‘ఇరు పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నట్టు తేలడంతో మా గ్రామంలోనే పంచాయితీ కూడా జరిగింది. ఓ నాయకుడిని బెదిరించడంతో ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని ఊళ్లోకే రావడంలేదు’ అంటున్నాడు హుజూరాబాద్ మండలం దమ్మక్కపేటకు చెందిన ఓ గల్లీ లీడర్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కోవర్టులే కొంప ముంచుతున్నారు. ఇటీవల ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరిన వారే ఈ లీకేజీ వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను దెబ్బకొట్టడమే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్.. టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా బీజేపీ నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఎవరిని నమ్మాలో..? వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో? తేల్చుకోలేక నేతలు భయపడుతున్నారు. హుజూరాబాద్ సెగ్మెంట్ లోని ప్రతి గ్రామంలో కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.
ఇలా చర్చలు.. అలా లీకులు
ఒక గ్రామానికి వెళ్లి కుల సంఘాలు లేదా యువజన సంఘాలతో చర్చలు పెట్టిన మరు నిమిషమే వెంటనే ఇతర పార్టీలకు సమాచారం చేరుతున్నది. నాయకులు రావడం, వారికి ఎంతో కొంత ముట్టజెప్పడం, ఎన్నికల నాటికి మళ్లీ ఆఫర్ ఇచ్చి బయటికి రాగానే.. ఇంకో పార్టీ నేతలకు విషయం చేరిపోతున్నది. దీంతో సదరు పార్టీ నేతలు చర్చలకు వస్తున్నారు.
నమ్మకం కుదిరేనా..?
ఎవరిని నమ్మాలి ఎవరిని అనుమానించాలి ఎవరు మనవాళ్లు ? ఎవరు కోవర్టులు? ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలను వేధిస్తున్న ప్రధాన సమస్య. తమ రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో పలుకుబడి సంపాదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఓ వైపు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం… మరోవైపు కోవర్టులను గుర్తించడం ఇక్కడి నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీలోకి వలసలు పెరగడంతో వచ్చిన వారు నిజంగానే పార్టీపై అభిమానంతో వచ్చారా ? లేక కోవర్టులుగా చేరారా? అనేది అనుమానాస్పదంగానే మారింది. పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించడంతోనే కోవర్టుల భయం పెరిగింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం మొదలైంది. ఇదే అదునుగా కోవర్టులు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇలాంటి నేతలను గుర్తించి పక్కన పెడుతున్నా.. కీలక విషయాలైతే బయటకు వస్తూనే ఉన్నారు.