నర్సు మరో ఐదుగురు కలిసి.. సినిమాను తలపించేలా..

by Sumithra |
Rachakonda CP Mahesh Bhagwat
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: నకిలీ రెండు వేల నోట్లతో అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరాన ముఠాను కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ఓ మహిళతో సహా ఐదుగురు నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక లక్ష 30 వేల నగదుతోపాటు కోటి రూపాయలు విలువ చేసే డమ్మీ రూ.2వేల నోట్లను, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మేడ్చల్ జిల్లా నేరేడ్ మేట్‌లోని రాచకొండ పోలీస్ కమీషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ కేసు వివరాలను వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్కానా గల్లీకి చెందిన పాత నేరస్థుడు మహామ్మద్ అజీజ్ అలియాస్ అజామ్(35) రియల్ ఏస్టేట్ వ్యాపారి. ఇతనికి పెద్దపల్లికి చెందిన అన్వర్ పాషా(38), సనత్ నగర్, ఆశోక్ కాలనీలో నివాసం ఉంటూ చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న తడుకా సుభాశ్ చంద్రభోస్(41)లతో పరిచయం ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన డ్రైవర్ మర్రి నాగరాజు(28) అనే వ్యక్తి ఆస్తి తగాలతో జైలుకెళ్లి, పాత నేరస్థుడు అజీజ్‌ను చర్లపల్లి జైలులో కలిశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న జంగం భాగ్యలక్ష్మి(40)కి అజీజ్, అన్వర్‌లతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ ఐదుగురు అమాయకులను నమ్మించి నకిలీ కరెన్సీని చెలామణి చేసి, ఈజీగా డబ్బులను సంపాదించాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్‌లోని ఓ లాడ్జీ నిర్వావహకుడు రవీందర్ సింగ్, రాజేశ్‌తో కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. అంతేగాకుండా.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామానికి చెందిన నర్రెడ్డి రాజిరెడ్డి(44)తో భాగ్యలక్ష్మికి ఆరు నెలల క్రితం పరిచయమైంది.

రాజిరెడ్డితో ఏర్పడిన పరిచయంతో కోటీశ్వరులు నల్లధనాన్ని అతి తక్కువ నగదుకే ఇస్తున్నట్లు భాగ్యలక్ష్మి నమ్మించింది. రూ.2 వేల నోట్లు త్వరలో రద్దు కాబోతున్నాయని, ధనికులంతా 500, 200 నోట్లను తీసుకుని రూ.2వేల నోట్లను ఇస్తున్నట్లు మాయమాటలు చెప్పింది. అయితే, అసలు నగదును తీసుకొని నకిలీ నోట్లను ఇచ్చేలా ప్రణాళికను రచించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుభాశ్ చంద్రబోస్ సహాయంతో ఈ ముఠా ఓ ఆర్ట్ డైరెక్టర్‌ను సంప్రదించారు. అజీజ్‌ను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ పరిచయం చేసి, ప్రభుత్వ ప్రకటనల కోసం షూట్ చేయబోతున్నాడని, డమ్మీ కరెన్సీ కావాలని బోస్ కోరాడు. దీంతో యూసుఫ్ గూడలోని కృష్ణానగర్ ప్రింటింగ్ ప్రెస్‌లో డమ్మీ కరెన్సీ కోసం అర్డర్ చేశారు. ఈ నేపథ్యంలో రాజిరెడ్డికి భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక లక్ష ఒరిజినల్ నోట్లు ఇస్తే.. రూ.5 లక్షలు బ్లాక్ మనీ( రూ.2వేల నోట్లు) ఇస్తామని నమ్మబలికింది. ఆమె మాటలు నిజమేనని నమ్మిన రాజిరెడ్డి.. నల్లధనం తీసుకోవడానికి తన వద్ద ఉన్న రూ.5 లక్షలు తీసుకొని శామీర్ పేట్‌లోని ఓ ఫామ్ హౌజ్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ అన్వర్, అతని ముఠా సభ్యులు మాటు వేశారు. ముఠాలోని ఓ సభ్యుడు పోలీసు దుస్తులు వేసుకుని రాజిరెడ్డిని తమ కారులో తీసుకుని తిమ్మాయిపల్లి వైపు తీసుకువెళ్లి బెదిరించాడు.

నల్లధనం దందా చేస్తున్నావని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 లక్షలు తీసుకుని పంపించాడు. వారం తర్వాత రాజిరెడ్డి తనకు జరిగిన మోసాన్ని గుర్తించి.. కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి.. ఏడుగురు నిందితుల్లో అజీజ్, అన్వర్, సుభాష్ చంద్రబోస్, నాగరాజు, భాగ్యలక్ష్మి ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు రవీందర్ సింగ్, రాజేశ్‌లు పరారీలో ఉన్నారని సీపీ మహేశ్‌ భగవత్ వివరించారు. నకిలీ నోట్ల కట్టపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అని ముద్రించారు. రెండు వేల నోటుపై కేవలం షూటింగ్‌ కోసమే అని ముద్రించారు. ఇవన్నీ చూసుకోకుండా బాధితులు మోసపోయారు. ఇంకా ఎంతమంది మోసపోయారో వివరాలు సేకరిస్తున్నాం. లక్షా 30 వేల నగదుతో పాటు కోటి రూపాయాల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఆదనపు కమిషనర్ సుధీర్ బాబు, డీసీపీ రక్షితమూర్తి, అదనపు డీసీపీ శివకుమార్, ఇన్ స్పెక్టర్ నరేందర్ గౌడ్, అదనపు ఇన్ స్పెక్టర్ బాబ్యా నాయక్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story