కేసీఆర్ ఇలాక ధాన్యం కొనుగోలు సెంటర్‌లలో భారీ అవినీతి..

by Shyam |   ( Updated:2021-12-17 21:53:01.0  )
rice
X

దిశ, గజ్వేల్: సాక్ష్యాత్ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడా అన్ని పనులు చాలా నిక్కచ్చిగా జరుగుతాయి. కాని ఇందుకు భిన్నంగా నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భారీ కుంభకోణం నడుస్తున్న పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు. వివరాలు ప్రకారం‘‘రాజా వారి చేపల చెరువు‘‘ సినిమాను తలపించేలా రికార్డుల్లో మాత్రం అవినీతి లెక్క అంతే పక్కాగా ఉంటుంది. కాని క్షేత్ర స్థాయిలో అసలు ఏమి ఉండదు. గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం నాచారం గ్రామ కొనుగోలు కేంద్రంలో జరిగిన తాజా సంఘటనే ఇందుకు నిదర్శనం. వర్గల్ మండలంలోని ఆయా గ్రామాల్లో ధాన్యం సేకరణ కోసం పీఎసీయస్ ఆధ్వర్యంలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 1633 మంది రైతుల నుండి ఈ నెల 16వ తేది వరకు 54,363 క్వింటాళ్ళ ధ్యాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు సరాఫరా చేశారు. రైతు నుండి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో తేమ శాతం 14 నుండి 17 ఉండేలా చూసుకోవాలి. అలాగే రైతు నుండి పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌తో పాటు మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి బస్తాలో ధాన్యాన్ని గరిష్టంగా 40.300 కేజీల నుండి 41 కేజీల భారం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర నిర్వహకుడి‌పైనే ఉంటుంది. నిర్ధేశిత పత్రాలన్ని సెంటర్ ఇంఛార్జీకి సమర్పించిన తర్వాతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. కాని ఇందుకు భిన్నంగా నాచారం ధాన్యం కొనుగోలు సెంటర్‌లో రైతుల వద్ద నుండి ఎలాంటి ధాన్యాన్ని సేకరించకుండానే కట్టే జయలక్ష్మీ నుండి 159 బస్తాలు మరియు కలకుంట్ల భీములు నుండి 140 బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా మెుత్తంగా 299 బస్తాల ధాన్యాన్ని సెంటర్ ద్వారా కొనుగోలు చేసినట్లుగా ట్రక్ షీట్ (రశీదు నెంబర్ 35568)ను తమకు సూచించిన అనంతగిరిపల్లి శివారులోని రాఘవేంద్ర బిన్ని మాడ్రన్ రైస్ మిల్‌కు ఇచ్చారు.

అంతే కాకుండా తమకు ధాన్యం ముట్టిందంటూ (రిసివుడ్) లెటర్‌ను ఇవ్వడం చెప్పుకో దగ్గ విషయం. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్న చందంగా 2 నుండి 3 లక్షల రూపాయల కుంభకోణానికి తెర లేపారు. మరి కొద్ది రోజుల్లోనే షీట్లో రైతులుగా పేర్కొన్న వారి అకౌంట్లతో దర్జాగా ప్రభుత్వ సొమ్ము జమ అయ్యేది. ఈ విషయం అందరికి తెలియడంతో చేసేందేం లేక అధికారులు దిద్దు బాటు చర్యలకు ఉపక్రమించారు. తమ అవినీతి తతంగం ఎక్కడ బయటపడుతుందనే భావనతో ట్రక్ షీట్‌ను రద్దు నిర్వహకులు తెలిపారు. ధాన్యం సెంటర్ల ఇన్‌ఛార్జీలు, రైస్ మిల్లుల యాజమానుల పరస్సర అంగీకారంతోనే ఈ కుంభకోణానికి తెరలేపినట్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలు అంశంలో సునిశిత దృష్టి సారించాల్సిన పీఎసీయస్ చైర్మన్లు, ఫ్యాక్స్ సీఈఓలు సైతం అవినీతి కథాంశంలో తమ పాత్రను విసృతంగా పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సప్లయ్ అధికారుల మొద్దు నిద్రలో జోగుతుండటంతో రైస్ మిల్లర్లు, ధాన్యం సెంటర్ల ఇన్ ఛార్జీలు అవినీతి అక్రమాల్లో రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులు కుమ్మకై బహిరంగానే ఈ దందాను ముందుకు నడుపుతున్నట్లు సమాచారం.

ఇదీ అసలు లెక్క..

క్వింటాళ్ల ధాన్యానికి గాను రైస్ మిల్లర్లు 67 కిలోల బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క ధాన్యం గింజ సేకరించ కుండా బియ్యం ఎలా ఇస్తారో మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం నగదు ప్రభుత్వం నుండి వారి అకౌంట్లలో దర్జాగా జమ అవుతుంది. ధాన్యం తీసుకున్నట్లు రశీదులు సృష్టించిన మిల్లర్లు తదనంతరం ప్రక్రియలో మరో అవినీతి కథాంశం చోటు చేసుకుంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేసిన బియ్యాన్ని మళ్ళీ రిసైక్లింగ్ చేస్తూ అదే సివిల్ సప్లయ్ శాఖకు మళ్ళీ అందజేయడం ఇది మరో దందా. ఈ తతంగం వెనుక సివిల్ సప్లయ్ అధికారుల అండదండలతో ఉన్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి.

ఉత్తుత్తి యాక్షన్ ప్లాన్..

ఇలాంటి తతంగమే సిద్దిపేట జిల్లా చేర్యాల పిఎసిఎస్ కేంద్రంలో కొన్నాళ్ళ క్రితం జరిగింది. ఎంక్వయిరీ పేరుతో అధికారులు నానా హంగామా కూడా చేశారు. ఈ క్రమంలోనే నిజం బట్టబయలైన లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టినట్లు అధికారులే నిర్ధారించారు. అప్పటి వరకు ఈ కథాంశంపై నానా హంగామా చేసిన అధికార గణం నిందితులపై చర్యల అంశంలో ఏంచక్కా చేతులు దులుపుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఏలాంటి అవినీతిని సహించేది లేదంటూ.. భారీ ప్రకటనలు చేసిన సదరు శాఖ కార్పొరేషన్ చైర్మన్, సివిల్ సప్లై అధికారులు రోజుకో అవినీతి దందా బయట పడుతున్న మిన్నకుండి చూడటం పై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తతంగం అంతా రాష్ర్ట వ్యాప్తంగా జరుగుతున్నట్లు సమాచారం ఉన్న అంతా తమ పార్టీ వాళ్ళు అని తమకు ఏం తెలియనట్టు నటిస్తున్నారు.

రైతులకు గుడ్ న్యూస్ : రైతుబంధుపై సర్కార్ కీలక ప్రకటన

Advertisement

Next Story

Most Viewed