అంగన్‌వాడీ ఉద్యోగాలు.. పంపకాలా.. పారదర్శకమా ?

by Shyam |
అంగన్‌వాడీ  ఉద్యోగాలు.. పంపకాలా.. పారదర్శకమా ?
X

దిశ,భూపాలపల్లి : జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల నియామకం అల్లకల్లోలమైనది. ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా జరుగుతాయా? లేదా నాయకులు పంపకాలు జరుగుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 135 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నియామకాలు జరగాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ తమకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావాహులను రాజకీయ నాయకుల వద్ద ఉన్న కొంతమంది చోట మోట నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్య దళారీలు అభ్యర్థుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని, ఒక్కొక్కరి వద్ద రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

ఒకవైపు ఉద్యోగాలు పారదర్శకంగా జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు వెంకటరమణా రెడ్డి పదే పదే ప్రకటనలు ఇస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకులు మాత్రం ఉద్యోగాల నియామకాలలో పైరవీలు వస్తున్నాయని వాటిని పంచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అంగన్వాడి ఉద్యోగాల్లో పారదర్శక లేక నాయకులు వాటిని పంచుకుంటున్నారని జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అందుకోసమే నిజాయితీగా ఉన్న అంగన్‌వాడీ డబ్ల్యూ ఓ ను ఇక్కడి నుండి అధికార పార్టీ నాయకులు పంపించారని ఆరోపణ ఉంది. జిల్లాలో అధికారంలో ఉన్నవారికి అంగన్‌వాడీ ఉద్యోగులను వాటాలుగా పంచుకున్నట్లు పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. అధికారులు మాత్రం మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం భూపాలపల్లి ,మహాదేవపూర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నట్టుండి అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి పత్రాలను పరిశీలించడం పూర్తయింది. అధికారులు అభ్యర్థుల జాబితాను తయారు చేసినట్లు తెలిసింది.

స్థానికులకే ప్రాధాన్యత..

పత్రాల పరిశీలన అనంతరం గ్రామాల్లోకి వెళ్లి పరిశీలన చేయడం జరుగుతుందని, గ్రామంలో నివాసం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా తీసుకుంటామని భూపాలపల్లి సీ.డీ.పీ. ఓ అవంతిక తెలిపారు. ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పిస్తే వారిని జాబితా నుండి తొలగించడం జరుగుతుందని, అందుకు గల కారణాలు అభ్యర్థులకు వివరిస్తామన్నారు. పూర్తి వివరాలు అభ్యర్థుల జాబితాను గ్రామపంచాయతీలో ఉంచడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు ఉండవని, ఎవరైనా దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని, మోసం చేస్తే వారిని నమ్మరాదని ఆమె దిశకు తెలిపారు.

మెరిట్ జాబితా లీక్ అవుతుందా?

జిల్లాలో అంగన్‌వాడీ అభ్యర్థుల జాబితా లీక్ అవుతుందా ?అనే విషయం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల పత్రాలను పరిశీలన జరిగే సమయంలో పత్రాల పరిశీలన చేసే ఉద్యోగులు అత్యధిక మార్కులు గల వారి పేర్లను నోట్ చేసుకుని, తమకు దగ్గర ఉన్న నాయకులకు లీక్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దళారులు మెరిట్ అభ్యర్థుల వద్దనుండి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంగన్‌వాడీ ఉద్యోగాల విషయంలో పంపకాలు జరిగాయా? పారదర్శకంగా జరిగిందా అనేది అభ్యర్థులునియామకాలు జరిగిన అనంతరం బహిర్గతమవుతుంది.

Advertisement

Next Story