బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్​ వైద్యం

by Shyam |   ( Updated:2021-10-16 07:49:08.0  )
Basthi davakana
X

దిశ, కూకట్​పల్లి: పేదోడికి వైద్యం అందని ద్రాక్షగా మారింది. జలుబు చేసిందని వెళ్లినా లక్షల రూపాయల బిల్లు వేస్తున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి పేదల కోసమే ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. బస్తీ దవాఖానలు ప్రారంభించి పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాయి. వీటిల్లో యువ డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన వైద్యం చేస్తున్నారు.

కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్​బీ డివిజన్‌లోని 4వ ఫేజ్​ కాలనీలో​ అత్యధికంగా పేద, మధ్య తరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వేలాది కుటుంబాలకు బస్తీ దవాఖానలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు ఇక్కడి వైద్యులు. స్థానిక ప్రజలకు నిత్యం కరోనా​ పరీక్షలు, వ్యాక్సిన్​ల అందించడంతో పాటు నిరంతరం రోగులకు వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. పదికి పైగా రక్త పరీక్షలను ఉచితంగా చేస్తూ వేలాది రూపాయాలను ప్రజలకు ఆదా చేస్తున్నారు.

ఉచితంగా చేసే రక్త పరీక్షలు ఇవే..

బస్తీ దవాఖానల్లో రోగులకు పదికి పైగా రక్త పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో వేల రూపాయలు అయ్యే ఈ టెస్టులను రోగులకు ఉచితంగా అందిస్తున్నారు. వీటిల్లో ఫాస్టింగ్​ బ్లడ్​ షుగర్​, పోస్ట్​ లంచ్​ బ్లడ్​ షుగర్​, థైరాయిడ్​ పరీక్ష, థైరాయిడ్​ సెరాలజీ, డెంగీ సెరాలజీ, కంప్లీట్​ బ్లడ్​ పిక్చర్​(సీబీపీ), లివర్​ ఫంక్షన్​ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్​ టెస్ట్, కొలెస్ట్రాల్​ టెస్ట్​‌లను చేస్తున్నారు.

ఉచిత వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Poojareddy

కార్పొరేట్ స్థాయిలో బస్తీ దవాఖానలో వైద్య సేవలను అందిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు వృథా చేసుకోకుండా బస్తీల్లోనే ఉన్న దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి. రక్త పరీక్షలతోపాటు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాం. పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది.
-డాక్టర్ పూజా రెడ్డి, బస్తీ దవాఖాన, కేపీహెచ్​బీ కాలనీ

Advertisement

Next Story

Most Viewed