- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలనం: తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య రాయబారి.. మెగా దందా!!
దిశ, తెలంగాణ బ్యూరో : రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల నిప్పుల్లో ఓ నిర్మాణ సంస్థ దందాకు దిగింది. తెలంగాణ సాగునీటిపారుదల శాఖలో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఆ నిర్మాణ సంస్థ సీమాంధ్ర ఉద్యమానికి అప్పట్లో నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య రాయాబారిగా మారింది. ఇటు తెలంగాణలో, అటు ఏపీలో నీళ్ల ప్రాజెక్టుల పనులు స్పీడ్‌గా చేస్తున్న ఆ సంస్థ చేతికి మట్టి అంటకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మీడియేషన్ పాత్రనూ పోషిస్తున్నట్లు అధికారులే గుసగులాడుకుంటున్నారు. ఈ సంధి రాయబారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనూ చర్చగా మారింది.
“నేను కొట్టినట్లు చేస్తా… నువ్వు ఏడ్చినట్లు నటించు” అనే చందంగా ఏపీ, తెలంగాణ మధ్య నడుస్తున్న నీళ్ల పంచాయతీకి ప్రధాన కర్తగా ఓ మెగా సంస్థ వ్యవహరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రెండు రాష్ట్రాలతో దోస్తానా చేస్తూ ఇరు రాష్ట్రాల సీఎంలనూ మచ్చిక చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. అందుకే ఇతర నిర్మాణ సంస్థలను ఇరు రాష్ట్రాల సీఎంలకు దూరం చేసి, కేవలం తాను మాత్రమే అంతటా చక్రం తిప్పుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కాలంలో మందులు, ఆక్సిజన్ సరఫరా చేయడం కూడా ఈ మెహర్బానీలో భాగమని సమాచారం. త్వరలో వైద్య రంగంలోకి కూడా దూకాలనుకుంటున్నది. ఇందుకోసం ఒక కార్పొరేట్ ఆస్పత్రితో ప్రాథమిక చర్చలు కూడా ముగిశాయి. ఇక పూర్తి స్థాయిలో టేకోవర్ చేసుకోవడమే తరువాయి.
నేనే చూసుకుంటా..!
ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల విమర్శలు మరోమారు తెరపైకి వచ్చాయి. ‘బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవు..‘ అంటూ రెండు రాష్ట్రాలూ కొంతకాలం సయోధ్యగా ఉన్నా గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత మళ్ళీ మాటల దాడులు చేసుకుంటున్నాయి. మూడేండ్ల సామరస్యం ఇప్పుడు నీళ్ళు-నిప్పులు తరహాలో పరస్పరం విమర్శల్లో దూకుడు స్థాయికి చేరుకుంది. ఈ తంతు అంతా వచ్చే ఎన్నికల కోసమే అనే అభిప్రాయాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలూ నీళ్ల సెంటిల్‌మెంట్‌ను ఓట్లుగా మల్చుకునేందుకు ప్లాన్ వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కానీ ఆ నిర్మాణ సంస్థ మాత్రం రెండు రాష్ట్రాల సీఎంలను సమన్వయం చేయడంలో మెగా ప్లాన్ వేసింది. కారణం రెండు రాష్ట్రాల్లోని నీళ్ల ప్రాజెక్టుల కాంట్రాక్టును ఈ నిర్మాణ సంస్థే దక్కించుకున్నది. పైకి ఎలాంటి వాతావరణం ఉన్నా లోపాయికారీగా మాత్రం మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాం నుంచి ఆ సంస్థపై ప్రేమ కురుస్తూనే ఉన్నది. చంద్రబాబు హయాంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే సంస్థ కథ నడిపించింది. అప్పుడు విపక్షంలో ఉన్న జగన్ కూడా ఆ సంస్థను తూర్పారపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్థే సన్నిహితంగా మారింది.
తెలంగాణలో రూ. 90 వేల కోట్లు, ఏపీలో దాదాపు రూ. 30 వేల కోట్ల ప్రాజెక్టు పనులను చేజిక్కించుకున్న ఆ సంస్థపై తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ‘సీమాంధ్రలోని కృత్రిమ ఉద్యమానికి ఫండింగ్ చేసింది‘ అంటూ ఆరోపించారు. స్వరాష్ట్రం అయిన తర్వాత కూడా ఆ సంస్థకు టాప్ ప్రయారిటీ లభించింది. కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ దక్కాయి. ప్రాజెక్టులన్నింటినీ కలుపుకుంటే దాదాపు రూ. 90 వేల కోట్ల కాంట్రాక్టు. ఇక రోడ్లు, ఎలక్ట్రిక్ బస్సులు లాంటివన్నీ కలుపుకుంటే లక్ష కోట్ల పైనే.
తెలంగాణకు అన్యాయం చేసే పనులైనా..?
సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నది. కేంద్రానికి, కృష్ణా బోర్డుకు లేఖలు రాసింది. తెలంగాణలోని కీలక ప్రాజెక్టుల పనులు చేసిన సంస్థే ఇప్పుడు ఆ ‘అక్రమ‘ ప్రాజెక్టునూ నిర్మిస్తున్నది. తొలుత ఈ నిర్మాణ సంస్థపై ఏపీ ప్రభుత్వం కొంత అనుమానాలు వ్యక్తం చేసింది. సంగమేశ్వరం పనుల ప్రగతి, వివరాలను తెలంగాణకు అందిస్తున్నట్లు అనుమానించింది. కానీ సదరు సంస్థ ఏపీ సీఎంకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏపీకి చెందిన సంస్థగా సొంత రాష్ట్ర వివరాలను ఎలా లీకు చేస్తామంటూ వివరణ ఇచ్చుకున్నది.
నీళ్ల సాకుతో టీడీపీకి జగన్ ఎసరు
ఇరు రాష్ట్రాల నీళ్ల రాజకీయాల్లో మెగా దగాకు పాల్పడుతున్నారనే అపవాదు సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం నీళ్ల పంచాయతీ కేవలం రాజకీయాల కోసమేనని, వచ్చే ఎన్నికల వరకు నీళ్ల సెంటిమెంట్ ఇలా రగులుతూనే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల కోసం మున్ముందు ఈ నీళ్ళ వ్యవహారం నిప్పులాగా మారుతుందన్న అంచనాలూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణకు ఆ మేరకు చేయలేదనే ఆరోపణలను తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల సమయానికి అవకాశం లేకుండా చేయడానికి నీళ్ల అంశంలో తెలంగాణను సాకుగా చూపించి భావోద్వేగాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ఘర్షణ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతున్నదని రెండు రాష్ట్రాల్లోనూ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పైకి కోపంగా ఉన్నట్లు రాజకీయంగా నటిస్తున్నా లోపల మాత్రం సదరు నిర్మాణ సంస్థ అధిపతి మధ్యవర్తిత్వంతో పరస్పర అవగాహనే ఉన్నట్లు టాక్. అందుకే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకదాని మీద మరొకటి ఎంత దుమ్మెత్తిపోసుకున్నా అది కేవలం నీటి బుడగ వంటిదేనని, కాంట్రాక్టు దక్కించుకున్న ఆ సంస్థ యధావిధిగా పని చేసుకుంటూనే పోతుందని, ఇరు రాష్ట్రాల కీలక నేతల మధ్య ఎలా సమర్ధింపులు చేయాలో మెగా ప్లాన్ ఉందని సాగునీటిపారుదల శాఖ అధికారుల అభిప్రాయం.