ఏపీలోనూ కరోనా కేసులు..?

by srinivas |   ( Updated:2020-03-05 00:59:50.0  )
ఏపీలోనూ కరోనా కేసులు..?
X

నిన్న మొన్నటి వరకు పాపం చైనా అని బాధపడిన చాలా మంది ఇప్పుడు పాపం భారత్..పాపం తెలుగు రాష్ట్రాలు అనే తరుణం వచ్చేసిందేమో. ఎందుకంటే కరోనా (కోవిడ్-19) భారత్‌లో ఎప్పుడో కాలు పెట్టినప్పటికీ తెలుగు రాష్ట్రాల ముఖం చూడలేదు. కోవిడ్ ఎట్టకేలకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ద్వారా ఇటలీ నుంచి హైదరాబాదులో అడుగుపెట్టింది.

కోవిడ్ చైనాను ఎంతలా వణికించిందన్న సంగతి తెలిసిందే. వేలాది మంది మరణించినప్పటికీ నియంతృత్వం కారణంగా ఆ మరణాల గురించి బయట ప్రపంచానికి తెలియనివ్వలేదని, అధికారిక మీడియా తెలిపిందే వాస్తవమంటూ కోవిడ్ తీవ్రతను తగ్గించి చూపించిందన్న ఆరోపణలు చైనా ప్రభుత్వం మీద ఉన్నాయి. ఇదే సమయంలో చైనా నియంత్రణాలోపంతోనే కోవిడ్ సుమారు 57 దేశాలకు విస్తరించింది.

చైనా సమగ్ర చర్యలు చేపట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని శాస్త్రవేత్తలు నిపుణులు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైజాగ్‌లో కోవిడ్ అనుమానితులు ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున కోవిడ్ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు.

వైజాగ్‌లోని ఛాతీ ఆసుపత్రిలో కోవిడ్ లక్షణాలతో ముగ్గురు చేరగా, శ్రీకాకుళం రిమ్స్‌లో ముగ్గురు, కాకినాడ, ఏలూరు, విజయవాడల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ అనుమానితులు చేరారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి, వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని హైదరాబాదుకు వైద్యపరీక్షల నిమిత్తం పంపించారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ వంటి దేశాలకు వెళ్లి వచ్చిన వారికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అనుమానితులందర్నీ ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ప్రత్యేక వైద్యచికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ అక్కడొక వ్యక్తికి సోకిందంట అంటే ఇక్కడొక వ్యక్తికి సోకిందంట అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోవిడ్ కంటే వేగంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పానిక్ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని, కోవిడ్‌పై వార్తలు షేర్ చేసేముందు విచక్షణతో ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు. స్వయం నియంత్రణతో సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని వారు సూచిస్తున్నారు.

Tags: carona, covind-19, china, andhra pradesh, vizag, kakinada, eluru, vijayawada,

Advertisement

Next Story

Most Viewed