కరోనా మహమ్మారి రీ అటాక్..!

by  |
కరోనా మహమ్మారి రీ అటాక్..!
X

దిశ, న్యూస్ బ్యూరో:

'ఒకసారి కరోనా వచ్చిన తర్వాత మళ్లీ వస్తుందా అని సందేహాలు ఉండేవి. హాంకాంగ్ మొదలు హైదరాబాద్ వరకు రెండోసారి వైరస్ బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. మూడోసారి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం ఎక్కడా మనం వినలేదు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఒక మైక్రో బయాలజిస్టుకు మాత్రం మూడోసారి కొవిడ్ సోకింది. మూడున్నర నెలల్లోనే మూడుసార్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు, ఐదేళ్ల కుమార్తెకు సైతం రెండుసార్లు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.

చివరకు ఈ ఉద్యోగం వద్దంటూ కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి వత్తిడి మొదలైంది. మూడోసారి వైరస్ వచ్చిన విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. తొలిసారి ఏప్రిల్ నెల ప్రారంభంలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోగా ఉద్యోగితోపాటు భార్యకు, కుమార్తెకు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ ముగ్గురికీ మామూలు జ్వరం, జలుబు తప్ప ఎలాంటి లక్షణాలు లేవు. వీరంతా రెండు వారాల పాటు ఐసొలేషన్‌లోనే ఉన్నారు. ఒకసారి వచ్చిపోయిందిగదా అని ధైర్యంగానే ఉన్నారు. మరో వారం పాటు క్వారంటైన్‌లో ఉండిపోయిన ఆయన ఏప్రిల్ చివర్లో విధుల్లో చేరారు. దాదాపు నెలన్నర రోజులపాటు ఉత్సాహంగానే డ్యూటీ చేశారు.

రెండు నెలలకే వైరస్ రీ అటాక్..

జూన్ నెల మొదటి వారంలో స్వల్పంగా జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడ్డారు. అనుమానం వచ్చి యాంటీజెన్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో భార్యకు, కుమార్తెకు కూడా టెస్టు చేయించారు. వారిద్దరికి కూడా పాజిటివ్ అని తేలిపోయింది. మళ్ళీ రెండు వారాల పాటు ఐసొలేషన్/క్వారంటైన్‌లో ఉండిపోయారు. జూన్ మూడవ వారంలో విధుల్లో చేరారు. సరిగ్గా నెల రోజులు డ్యూటీ చేసిన తర్వాత జూలై మూడో వారంలో మళ్ళీ జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి.

మొదటిసారి, రెండోసారి ఉన్నట్లుగానే ఈసారి కూడా అవే లక్షణాలు రావడంతో అనుమానం వచ్చి మళ్ళీ టెస్టు చేయించుకున్నారు. పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఎక్కడో తేడా ఉందని అనుమానం వచ్చి మరో బ్యాచ్‌ తయారీ కిట్‌తో పరీక్ష చేయించుకున్నారు. అక్కడ కూడా పాజిటివ్ అని వచ్చింది. దాదాపు పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి జూలై చివరి వారంలో విధుల్లో చేరారు. మూడు నెలల వ్యవధిలో ఈ మైక్రో బయాలజిస్టు ఒక్కడే సుమారు 15 వేలకు పైగా కరోనా శాంపిళ్ళను తీసుకోవడంతోపాటు లాబ్‌లో పరీక్షించారు. దాదాపుగా వైరస్‌ను వెంటబెట్టుకునే తిరిగారు. దాంతో సహజీవనం చేశారు.

తరచూ ఎందుకొస్తోంది?

మైక్రోబయాలజీ చదివిన ఈ పోస్టు గ్రాడ్యుయేట్ ఉద్యోగికి వైరస్ పైనా, అది వ్యాప్తి చెందే విధానంపైనా, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. వయసు కూడా 30 ఏండ్లు మాత్రమే. శరీరంలో ఇమ్యూనిటీ తగినంత పుష్కలంగా ఉంది. వైరస్ సోకినప్పటికీ సాధారణ వైరల్ లక్షణాలు తప్ప ఆసుపత్రిలో చేరేంత సీరియస్ కండిషనేమీ లేదు. ఇతర వ్యాధులు కూడా పెద్దగా లేవు. అన్నింటికీ మించి మనోధైర్యం చాలా ఎక్కువ. వృత్తిరీత్యా అనుమానిత పేషెంట్ల నుంచి తీసుకునే శాంపిళ్ళ (స్వాబ్)ను లాబ్‌లో పరీక్షించడం అతని డ్యూటీ.

ఉదయం డ్యూటీ ఎక్కింది మొదలు దిగేంతవరకు పీపీఈ కిట్, గ్లౌజులు, మాస్కు తదితర అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడో తెలియని నిర్లక్ష్యంతో మొదటిసారి ఇన్‌ఫెక్షన్ వచ్చింది. మరింత జాగ్రత్తగా ఉండాలని భావించి పక్కా ప్రమాణాలు పాటించారు. రెండు నెలలకే రెండోసారి వైరస్ సోకడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడ లోపం జరిగిందో పరిశీలన మొదలుపెట్టారు. కంటైన్‌మెంట్ జోన్‌లకు వెళ్ళి ఒకే ఇంట్లో వైరస్ లక్షణాలు ఉన్న పదిమంది నుంచి శాంపిళ్ళు తీసుకున్న దగ్గర అంటుకుని ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఆ పది శాంపిళ్ళలో ఆరు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడే వెంటిలేషన్ లేని ఆ గదుల్లో తప్పకుండా వైరస్ అంటుకుంటుందేమోనని అనుమానించారు. ఆ అనుమానమే నిజమైంది.

PPE కిట్‌తోనే తంటా..

మూడోసారి కూడా పాజిటివ్ అని తేలడంతో నిత్యం పీపీఈ కిట్, గ్లౌజులు, మాస్కుతోని ఉన్నా ఎందుకు సోకి ఉంటుందని మరింత నిశితంగా ఆలోచించడం మొదలుపెట్టారు. చివరకు తేలిందేమంటే పీపీఈ కిట్ వేసుకున్నంతసేపూ ఇన్‌ఫెక్షన్ లేదుగానీ దాన్ని తీసేటప్పుడు మరో వ్యక్తి సాయం లేకుండా తనంతట తానుగానే తొలగించే క్రమంలో వాటి ఉపరితలంలో ఉండేది శరీరానికి, బట్టలకు అంటుకోవడం ద్వారా తరచూ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నట్లు నిర్ధారించుకున్నారు. మూడోసారి వైరస్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రంలో ఉండిపోయారు.

కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. అతని భార్య ఆందోళనకు గురైంది. జాగ్రత్తలు తీసుకున్నా దాని బారిన పడడానికి ఉద్యోగమే కారణమని భావించి దాన్ని వదులుకోవాల్సిందిగా కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చారు. ఏదైనా ఇతర వృత్తి చేసుకోవడం మేలనే నిర్ణయానికి వచ్చారు. అది దొరకగానే ఈ పనిని తాత్కాలికంగానైనా మానేద్దామనుకుంటున్నారు. మూడుసార్లు వైరస్‌కు గురైన విషయం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా, ఆయనతో పనిచేసే సిబ్బందికి ఈ విషయం తెలియకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. వ్యక్తిగత పనుల మీద సెలవులో ఉన్నారంటూ నమ్మించారు. ఈ ఉద్యోగి కూడా గోప్యంగా ఉంచారు. ఉన్నతాధికారులు సహకరిస్తే మరో విభాగంలోకి బదిలీ కావడం లేదా కొంతకాలం ఈ వృత్తిని విడిచిపెట్టి ఏదో ఒక చిరుద్యోగం చేసుకుని బతకడమో మేలని భావిస్తున్నారు.


Next Story

Most Viewed