BREAKING: ప్రధాని మోడీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

by Satheesh |   ( Updated:2024-04-26 15:53:35.0  )
BREAKING: ప్రధాని మోడీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షా తలుచుకున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రిజర్వేషన్లను రద్దు చేసి దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఈ సారి 400 సీట్లు గెలవాలి.. రాజ్యాంగా మార్చాలని మోడీ కంకణం కట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, డీఆర్ఎడీవో వంటి ఎన్నో సంస్థలను ఇచ్చిందని.. కాంగ్రెస్ ఇచ్చిన కంపెనీలను మోడీ, అమిత్ షా కలిసి అంబానీ, అదానీలకు అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. అనాడు బ్రిటిషర్లు మొదటగా దేశంలోని సూరత్‌కు చేరుకుని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారు.. ఇప్పుడు కూడా అదే సూరత్ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని కమలం పార్టీకి సీఎం రేవంత్ ఈ సందర్భంగా కొత్త అర్థం చెప్పారు. బ్రిటీష్ వాళ్ల లాగే బీజేపీ వాళ్లకు కూడా రిజర్వేషన్లు నచ్చవని.. అందుకే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగానే బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.



Advertisement

Next Story