విమానయాన రంగంలో 20 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

by Harish |
విమానయాన రంగంలో 20 లక్షల ఉద్యోగాలకు ముప్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఇప్పటికే అనేక రంగాల్లో ఉద్యోగాలు పోతాయని విశ్లేషకుల దగ్గరినుంచి నిపుణుల వరకూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రధాన విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాల్లో కోతను విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్నేషన్ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియాలోని విమానయాన, దాని అనుబంధ రంగాల్లో సుమారు 20 లక్షల ఉద్యోగాలకు ముప్పు తప్పదని అభిప్రాయపడింది. ఇప్పటికే వ్యాపార పరంగా సవాళ్లను ఎదుర్కోలేక దేశీయ విమానయాన సంస్థలు కొందరిని తొలగించాయి. అయితే, ఉద్యోగులను తొలగించినప్పటికీ ఆర్థిక అంతరాయాల నుంచి తప్పించుకోలేవని ఐఏటీఏ పేర్కొంది. ఇండియాలో ప్రయాణీకుల ద్వారా విమానయాన సంస్థలకు రూ. 67,370 కోట్ల ఆదాయం తగ్గిపోతుందని, ప్రయాణీకుల డిమాండ్ సైతం 36 శాతం క్షీణిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రభావం కారణంగా విమానయాన రంగంలో 20 లక్షల వరకూ ఉద్యోగాలకు ముప్పు తప్పదంటూ ఐఏటీఏ ఆసియ పసిఫిక్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు.

ఇటువంటి సమయాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఎయిర్‌లైన్ సంస్థలకు నగదు లభ్యత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ పన్నులను, ఎరోనాటికల్ ఛార్జీలను కొంత మేరకు ఎత్తేయాలను అన్నారు. గత నెల నుంచి విమానాలు పార్కింగ్‌లకే పరిమితం కావడం వల్ల దేశీయ విమానయాన సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణీకుల నుంచి వచ్చే రూ. 24 లక్షల కోట్ల ఆదాయం పోతుందని, ప్రయాణీకుల డిమాండ్ కూడా 48 శాతం తగ్గిపోతుందని నివేదిక అంచనా వేస్తోంది. ప్రస్తుతం విమానయాన సంస్థల వద్ద రూ. 4.67 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రానున్న త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పతనం కారణంగా, డిమాండ్ పడిపోనున్న నేపథ్యంలో సంస్థల వద్ద ఉన్న నిల్వలు కరిగిపోతాయి. ఉన్న నిల్వలను ఖర్చు చేసుకుని విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటాయని ఐఏటీఏ నివేదిక పేర్కొంది.

Tags: Coronavirus, COVID-19, India Lockdown,

Advertisement

Next Story

Most Viewed